భక్తుల మనసు భగవంతుడికి తెలుసు

భక్తుల మనసు భగవంతుడికి తెలియకుండా ఎలా వుంటుంది ? భక్తుల అవసరాలను తీర్చేది ... ఆపదల నుంచి వాళ్లను కాపాడేది ఆ భగవంతుడేగా ! తామే సర్వస్వమనుకుని తమ ఆరాధనాలో భక్తులు తరించిపోతుంటే, వాళ్ల కుటుంబ సంబంధమైన బాధ్యతలను భగవంతుడే నెరవేర్చిన సందర్భాలు ఎంతోమంది భక్తుల విషయంలో కనిపిస్తూ వుంటాయి. అలాంటి భక్తుల జాబితాలో మనకి 'త్యాగయ్య' కూడా కనిపిస్తూ వుంటాడు.

అనునిత్యం ... అనుక్షణం త్యాగయ్యకి శ్రీరాముడి ధ్యాస తప్ప మరొకటి వుండేది కాదు. రాముడు సన్నిధి గురించే తప్ప, సంపాదనపై ఆయన ఎప్పుడూ దృష్టిపెట్టక పోవడం వలన ఇల్లు గడవడమే కష్టంగా వుండేది. ఎదిగిన కూతురు పెళ్లికి ఉండటంతో, సన్నిహితుల మాటల్లో ఆ ప్రస్తావన వచ్చేది. సంపాదన గురించిగానీ ... పెళ్లి సంబంధాల గురించి గాని త్యాగయ్య ఆలోచన చేయకపోవడం పట్ల వాళ్లు ఆవేదన చెందేవారు.

ఒకవేళ వాళ్లు ఆయన దగ్గర ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తే, రాముడు వుండగా చింత ఎందుకనే సమాధానం వచ్చేది. విశేషం ఏమిటంటే త్యాగయ్య విశ్వాసానికి తగినట్టుగానే, ఒకరోజున ఆయన ఇంటికి నడి వయసులో వున్న దంపతులు వస్తారు. తమని గురించి త్యాగయ్యకి పరిచయం చేసుకుంటారు. తమ కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని, సంబంధాలు చూడటం మొదలుపెట్టినట్టుగా చెబుతారు.

ఒక రోజున శ్రీరాముడు తమ కలలో కనిపించి ... త్యాగయ్య కూతురుని కోడలిగా చేసుకోమని చెప్పాడని అంటారు. భగవంతుడి ఆదేశాన్ని శిరసావహించి వచ్చామని చెబుతారు. తన ప్రభువు పంపించిన సంబంధాన్ని తానెలా కాదనగలనంటూ రామచంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకున్న త్యాగయ్య, ఆ దంపతుల కుమారుడికి తన కూతురినిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. అసమానమైన ఆయన భక్తికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. అలాగే భక్తుల పట్ల భగవంతుడికి గల ప్రేమానురాగాలను ఈ లోకానికి మరోమారు చాటింది.


More Bhakti News