అమ్మవారు ఇలా వెలుగు చూసిందట !

శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళా భక్తులతో అమ్మవారి ఆలయాలు ఎంతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. ఈ మాసంలో ఆరాధించడం వలన పార్వతీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదించగా, లక్ష్మీదేవి సిరిసంపదలను అనుగ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మవార్లు ఆయా సందర్భాల్లో ధరించిన రూపాలు ... వివిధ నామాలతో వెలసిన రూపాలు కూడా విశేష పూజలను అందుకుంటూ వుంటాయి.

అలా పార్వతీదేవి అంశావతారంగా చెప్పబడుతోన్న 'పోలమాంబ' మనకి విశాఖ జిల్లా 'పెదవాల్తేరు' లో దర్శనమిస్తూ వుంటుంది. 'కుంచమాంబ' పేరుతో లక్ష్మీదేవి ... 'నీలమాంబ' పేరుతో సరస్వతీదేవి గల ఆలయంలో పోలమాంబ కొలువై కనిపిస్తూ వుంటుంది. ఈ అమ్మవారు మహిమగల దేవతగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఆమె బయటపడిన తీరే అందుకు నిదర్శనమని చెబుతుంటారు.

మహిమాన్వితమైన ఆ సంఘటన గురించి తెలుసుకోవాలంటే, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లవలసి వుంటుంది. ఒక రోజున కొంతమంది జాలరులు సముద్రంలో చేపల వేటకి వెళతారు. అలా వల విరిసి చేపలు పడుతోన్న వాళ్లు ఒక సమయంలో 'వల' మరింత బరువు పెరగడం గమనిస్తారు. పెద్ద చేప పడి ఉంటుందని భావించి, వలను గబగబా పైకి లాగుతారు. వలలో అమ్మవారి విగ్రహం వుండటం చూసి ఆశ్చర్యపోతారు.

తమని కాపాడటం కోసమే ఆ తల్లి వచ్చిందని భావించి, తీరానికి చేరుకొని అక్కడివారికి జరిగింది చెబుతారు. అందరూ కలిసి అమ్మవారిని ఒక 'కరక చెట్టు' కింద వుంచి హారతి పడతారు. ఈ కారణంగానే ఇక్కడి అమ్మవారిని 'కరకచెట్టు పోలమాంబ' గా పిలుస్తుంటారు. అలా స్వయంభువు మూర్తిగా బయటపడిన అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. ఆ తల్లి తమ సౌభాగ్యాన్ని కాపాడుతూ ఉంటుందనీ, పాడి పంటలను రక్షిస్తూ ఉంటుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అనుభవాలుగా వెలుగుచూసిన ఆ తల్లి మహిమలను చెప్పుకుంటూ తరిస్తుంటారు.


More Bhakti News