ఈ రోజున గొడుగును దానంగా ఇవ్వాలి
శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున 'గొడుగు'ను దానం చేయడం వలన విశేషమైనటు వంటి పుణ్య ఫలాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రావణమాసంలో వచ్చే ఏకాదశి విశిష్టత అంతా ఇంతా కాదు. పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ ఏకాదశిని 'పుత్రదా ఏకాదశి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ మంగళవారం సౌభాగ్యాన్ని ... శ్రావణ శుక్రవారం సిరిసంపదలను ప్రసాదిస్తే, శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఇలా స్త్రీ జీవితానికి పరిపూర్ణతను సమకూరుస్తూ వెళ్లడమే శ్రావణమాసం గొప్పతనంగా కనిపిస్తూ వుంటుంది. పూర్వం మహాజిత్తు అనే ఒక రాజు వారసుడు లేకపోవడంతో దిగాలు చెందుతాడు.
ఈ విషయంగా ఆయన అనేక క్షేత్రాలను దర్శిస్తూ, ఆ క్రమంలో కొంతమంది మహర్షుల దర్శనం చేసుకుంటాడు. పుత్ర సంతానం కోసం తాను పడుతున్న బాధను గురించి చెప్పుకుంటాడు. దాంతో ఆ మహర్షులు శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ వ్రతాన్ని చేయమని చెబుతారు. ఉపవాస దీక్షను చేపట్టి ... జాగరణకు సిద్ధపడి శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి ... ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించమని అంటారు.
నియమ నిష్ఠలతో వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత, గొడుగును దానంగా ఇవ్వమని సెలవిస్తారు. విశేషమైన ఈ రోజున గొడుగును దానంగా ఇవ్వడం వలన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందనీ, మనోభీష్టం నెరవేరుతుందని స్పష్టం చేస్తారు. మహర్షుల సూచనమేరకు మహాజిత్తు ఈ రోజున వ్రతాన్ని ఆచరించి ... పుత్ర సంతానాన్ని పొందుతాడు. ఈ కారణంగానే శ్రావణ శుద్ధ ఏకాదశి ... 'పుత్రదా ఏకాదశి' గా పిలవబడుతోంది.