దీర్ఘవ్యాధులను నివారించే ఆంజనేయుడు
సాధారణంగా గ్రహసంబంధమైన దోషాల వలన ఇబ్బందులు పడుతున్నవాళ్లు ... దుష్ట ప్రయోగాల వలన అవస్థలు పడుతున్నవాళ్లు హనుమంతుడిని ఆశ్రయిస్తుంటారు. శివాంశ సంభూతుడుగా చెప్పబడుతున్నందు వలన ... విష్ణు భక్తుడు కావడం వలన ... సూర్యుడి చెంత శాస్త్రాలు అభ్యసించినందు వలన ఆయన శక్తి అపారమైనదని విశ్వసిస్తూ వుంటారు.
చిరంజీవిగా హనుమంతుడు వరాన్ని పొందడం వలన ... ఆయన్ని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని చెప్పడం వలన భక్తులు ఆయన అనుగ్రహాన్ని కోరుతూ సేవిస్తుంటారు. గ్రహ పీడలను తొలగిస్తూ ... దుష్ట ప్రయోగాలను తరిమికొట్టే హనుమంతుడి ఆలయాలు ఆయా క్షేత్రాల్లో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులను పారద్రోలే హనుమంతుడు ఒక విశిష్టమైన క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ క్షేత్రమే ... అప్పలాయగుంట ... ఇది తిరుపతి సమీపంలో విలసిల్లుతోంది. అప్పలాయగుంట అనే పేరు వినగానే పద్మావతి - గోదాదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం కనులముందు కదలాడుతుంది. ఈ క్షేత్రంలోనే హనుమంతుడి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం ఈ హనుమంతుడి ప్రత్యేకతయని చెబుతుంటారు. ఈ స్వామిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలను కోరుతూ మొక్కుకుంటే, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని అంటారు. అందుకు నిదర్శనంగా వ్యాధులు తగ్గినవాళ్లు ఇక్కడి హనుమంతుడి సన్నిధిలో మొక్కులు చెల్లిస్తూ కనిపిస్తుంటారు. అందువలన అప్పలాయగుంట వెళ్లే భక్తులు, వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని అందించే ఇక్కడి మహిమగల మారుతిని దర్శించడం మరిచిపోకూడదు.