బిల్వపత్రం ఇలా సమర్పించాలి !
బిల్వవృక్షాన్ని మారేడు చెట్టు అని కూడా పిలుస్తుంటారు. కొండలు ... జలపాతాలు ఎక్కువగా గల ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఇక ప్రాచీన శివాలయాల్లోను ఇవి దర్శనమిస్తూ వుంటాయి. పరమశివుడి పూజలో బిల్వ దళానికి ఎంతో ప్రాధాన్యత వుంది. మూడేసి ఆకులుగా ఇవి కనిపిస్తూ శంకరుడి చేతిలో త్రిశూలాన్నీ ... ఆయన త్రినేత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. ఇక మూడు ఆకులు కలిగిన బిల్వదళం త్రిమూర్తులకు ప్రతీకగా కూడా చెబుతుంటారు.
అలాంటి బిల్వదళం సదాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. బిల్వదళాలతో పూజిస్తే ఆదిదేవుడుకి ఆనందం కలుగుతుందనీ ... ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు. వివిధ రకాల పూలతో అభిషేకించడం కన్నా ... ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించడం వలన ఆయన సంతోషపడిపోతాడని చెబుతారు. అందుకే శివుడి అనుగ్రహాన్ని కోరే భక్తులు అత్యధిక సంఖ్యలో బిల్వదళాలతో పూజిస్తూ వుంటారు.
ఇక బిల్వదళాలు అందుబాటులో వున్న వాళ్లు అనునిత్యం వాటితోనే ఆయని సేవిస్తుంటారు. అయితే శివలింగానికి బిల్వదళాన్ని సమర్పించడంలో ఒక నియమం చెప్పబడుతోంది. ఒక్కో బిల్వదళాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు బిల్వదళంలోని నునుపైన భాగం శివలింగపై ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేయబడుతోంది. ఇలా బిల్వదళాలతో ఉమాశంకరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలతో పాటు మోక్షం లభిస్తుందని చెప్పబడుతోంది.