రాఘవేంద్రుడి మహిమ అలాంటిది !
తంజావూరు ప్రభువు మనసు తీవ్రమైన అలజడికి లోనవుతుంది. తంజావూరు కరవు బారిన పడటం ... కనుచూపు మేరలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం ఆయనను తీవ్రమైన అలజడికి గురిచేస్తుంది. వర్షాలు కురవని కారణంగా బావులు ... చెరువులు ఎండిపోవడంతో తాగునీరు లభించడమే కష్టంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి రాఘవేంద్రస్వామి గుర్తుకువస్తాడు.
చనిపోయినవారిని రాఘవేంద్రస్వామి బతికించిన సందర్భాలు వున్నాయి. అలాగే ఆయన మోడువారిపోయిన చెట్టును చిగురింపజేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. అలాంటి రాఘవేంద్రుడే తంజావూరును ప్రస్తుతమున్న పరిస్థితి నుంచి గట్టెక్కించగలడని ఆయన భావిస్తాడు. అనుకున్నదే తడవుగా తానే స్వయంగా వెళ్లి, స్వామిని వెంటబెట్టుకు వచ్చి పరిస్థితిని వివరిస్తాడు. వెంటనే వర్షాలు కురవకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆయన ఏంచేస్తాడా అని ఆశగా ఎదురుచూడసాగారు.
పరిస్థితిని అర్థం చేసుకున్న స్వామి, తాను నిత్యం ఆరాధించే మూలరాముడిని మనసులో తలచుకుని ఆకాశం వంక చూస్తాడు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయి, వర్షధారలు నేలను తాకుతాయి. ప్రజలంతా ఆనందంతో పొంగిపోతూ ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారు. ఆ తరువాత అక్కడి ఖాళీ ధాన్యపు గది నుంచి ధాన్యాన్ని సృష్టించి ఆయన ప్రజల ఆకలి తీరుస్తాడు. ప్రజల గుండె గుడిలో కొలువై నిత్యపూజలు అందుకుంటాడు.