సుఖసంతోషాలనిచ్చే సుబ్రహ్మణ్యుడు
సుబ్రహ్మణ్యస్వామి ఎంతటి శక్తిమంతుడో ... అంతటి కారుణ్యమూర్తి. భక్తులను ఆదరించడంలోను ... అనుగ్రహించడంలోను ఆయన తండ్రికి తగిన కొడుకుగా కనిపిస్తాడు. మితిమీరుతోన్న అసురుల ఆగడాలను అరికట్టడం కోసం దేవతలకు సహాయంగా నిలిచిన పరాక్రమవంతుడు ఆయన.
ఆ స్వామి కారణంగానే పంచారామాలు ఆవిర్భవించాయి. అంతే కాదు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం భూలోకవాసులకు లభించాలనే ఉద్దేశంతో, వాళ్లు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించేలా చేశాడు. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి పూజలందుకునే విశిష్ట క్షేత్రాల్లో ఒకటి 'అత్తిలి'లో దర్శనమిస్తూ వుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అలరారుతోన్న ఈ క్షేత్రం ... సుబ్రహ్మణ్యస్వామి భక్తులు తప్పక దర్శించవలసిన క్షేత్రం.
భారీ నిర్మాణంగా కనిపించే ఈ ఆలయంలో స్వామివారు వల్లీ దేవసేన సమేతంగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఆలయం పక్కనే పెద్ద చెరువు కనిపిస్తూ వుంటుంది. చాలాకాలం క్రిందట ఈ చెరువులో నుంచే స్వామివారి స్వయంభువుమూర్తి బయటపడింది. ఈ శిలా ప్రతిమ దేహమంతటా సర్పంలా పొలుసుల ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటూ వుంటారు.
ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. స్వామివారిని దర్శించి మొక్కుకున్నవారికి వివాహ యోగం ... సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. మొత్తంగా ఆయన సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. పర్వదినాల్లో ఆ స్వామిని మరింత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తరిస్తుంటారు.