సకల శుభాలనిచ్చే గణపతి దీక్ష
దేవతలు ... మహర్షులు ... సామాన్య మానవులు ... ఇలా ఎవరు ఏ కార్యాన్ని ఆరంభించాలన్నా ముందుగా గణపతిని పూజించవలసిందే. ఇక ఏ దైవకార్యాన్ని తలపెడుతున్నా ముందుగా ఆయనను ఆరాధించవలసిందే. ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన అనుగ్రహం లేకుండా ఎవరూ ఏమీ సాధించనూ లేరు. అందుకే వినాయకుడి ఆలయాలు ఎక్కడ వున్నా ఎప్పుడూ సందడిగానే కనిపిస్తూ వుంటాయి.
ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో విశిష్టమైనవిగా చెప్పబడే వినాయక మూర్తులు దర్శనమిస్తూ వుంటాయి. వాటన్నింటికంటే విశేషమైనమూర్తిగా 'శ్వేతార్కమూల గణపతి' చెప్పబడుతున్నాడు. సహజసిద్ధంగా గణపతి ఆకృతిని సంతరించుకున్న 'తెల్లజిల్లేడు చెట్టు వేరు మూలం' శ్వేతార్కమూల గణపతిగా పూజలందుకోవడం జరుగుతుంది. శ్వేతార్కమూల గణపతి గల ఆలయం మనకి వరంగల్ జిల్లా కాజీపేటలో దర్శనమిస్తుంది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన అనేక దోషాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతుంటారు.
గణేశ మండల దీక్షలు తీసుకునే భక్తులు ఈ క్షేత్రంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. సాధారణంగా కొంతమంది గణపతి నవరాత్రులలో గణపతి దీక్ష తీసుకోవడం చేస్తుంటారు. మరికొందరు 'శ్రావణ శుద్ధ చవితి' నుంచి గణేశ దీక్షను స్వీకరించడం మరింత శ్రేష్టమని భావిస్తుంటారు. పదకొండు రోజులు గానీ ... ఇరవై ఒక్క రోజులు గాని ... నలభై ఒక్కరోజును గాని దీక్షా కాలంగా ఎంచుకుని ఆ స్వామి సేవలో తరిస్తుంటారు.