నాగుల ప్రాధాన్యత గల క్షేత్రం

ప్రాచీనకాలం నుంచి సర్పాలను దేవతలుగా భావించి పూజించడం జరుగుతోంది. పరమశివుడి కంఠాభరణంగా కనిపించే సర్పం, శివలింగ రూపానికి కూడా అలంకరణగా దర్శనమిస్తూ వుంటుంది. అలాగే శ్రీమన్నారాయణుడు శయనించేది ఆదిశేషుడుపై కనుక, ఆయన శయనముద్రలో దర్శనమిచ్చే ప్రతి క్షేత్రంలోను ఆదిశేషుడు కూడా పూజలు అందుకుంటూ వుంటాడు. ఇక శివపార్వతుల తనయుడు కుమారస్వామి కూడా సర్పరూపంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతటి విశేషాన్ని సంతరించుకున్న సర్పజాతి 'శ్రావణ శుద్ధ పంచమి' రోజున ఆవిర్భవించింది కనుక, ఆ రోజున నాగులను పూజించడం ఒక ఆచారంగా వస్తోంది. భగవంతుడి సేవ కారణంగానే తాము పూజలు అందుకుంటున్నామనే విషయాన్ని సర్పజాతి మరిచిపోలేదు. ఆ కృతజ్ఞతతోనే అవి ఆ దైవాన్ని మరింత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాయనడానికి ఎన్నో ప్రదేశాల్లో నిదర్శనాలు కనిపిస్తుంటాయి.

నల్గొండ జిల్లా పెన్ పహాడ్ మండలంలో 'నాగులపాడు' అనే ఒక గ్రామం వుంది. ప్రాచీనకాలం నాటి ఇక్కడి శివాలయం మహిమాన్వితమైనదని చెబుతుంటారు. ఒకే గర్భాలయంలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడి వుండటం ఇక్కడి ప్రత్యేకత. పూర్వం ఈ శివలింగాలను నాగులు దర్శించుకుని వెళ్లేవని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'నాగులపాడు' అనే పేరు వచ్చిందని అంటారు.

ఇప్పటికీ నాగులు ఇక్కడి స్వామిని ఆరాధిస్తూ ఉంటాయని అంటారు. అందుకు నిదర్శనంగా ఈ పరిసరాల్లో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతారు. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన ఈ క్షేత్రం, మహిమాన్వితమైనదనే విశ్వాసం భక్తుల్లో కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యతోపాటు నాగదేవతను కూడా ఆరాధిస్తూ వుంటారు.


More Bhakti News