ఆశలు నెరవేర్చే ఆశాదశమి
జీవితమన్నాక ఎన్నో ఆశలు ... కోరికలు వుంటూనే వుంటాయి. అవి లేకపోతే చైతన్య మనేది లేక నిరాశా నిస్పృహలు అలుముకుంటూ వుంటాయి. ఆశ అనేది ఉన్నప్పుడే అది నెరవేర్చుకోవడం కోసం శ్రమించడం జరుగుతూ వుంటుంది. నిరంతర శ్రమవలన ఆశలు ఫలిస్తాయి ... కోరికలు నెరవేరుతాయి.
అనుకోని కారణాల వలన ఈ విషయంలో ఆశించిన ప్రయోజనం కనిపించకపోతే, ఆధ్యాత్మికపరంగా కూడా ఆలోచన చేస్తుంటారు. అలా చూసినప్పుడు .. ఆశలు నెరవేర్చుకోవాలనుకునే వాళ్ల కోసం 'ఆశాదశమి వ్రతం' చెప్పబడుతోంది. శ్రావణ శుద్ధ దశమి ... ఆశాదశమిగా పిలవబడుతోంది.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు వుంటాయి. అవి నెరవేరితే చాలని వాళ్లు అనుకుంటూ వుంటారు. తమ ఆశలు ఫలిస్తే జీవితం సంతోషంగా సంతృప్తికరంగా సాగిపోతుందని భావిస్తుంటారు. అలాంటివారికి ఆశాదశమి వ్రతం ఒక వరమని చెప్పవచ్చు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఉపవాస దీక్షను చేపట్టి ... పూజామందిరంలో గల పార్వతీ పరమేశ్వరుల చిత్ర పటాలను అలంకరించి,షోడశ వుపచారలతో ఆరాధించాలి.
ఇక ఇదే రోజు ప్రదోష కాలంలో ఆది దంపతులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి, దానినే ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చేయడం వలన మనసులోని ఆశలన్నీ అనతికాలంలోనే తీరిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.