భక్తుల కోరికను భగవంతుడు మన్నిస్తాడు
త్యాగయ్య ఆరాధిస్తోన్న సీతారాముల విగ్రహాలను ఆయన అన్నయ్య కావేరీ నదిపాలు చేస్తాడు. ఆ విషయం తెలియని త్యాగయ్య వాటిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఈ నేపథ్యంలో ఆయన అనేక పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ వుంటాడు. అలాంటి సందర్భంలోనే ఒక ఇల్లాలు తన భర్త శవం దగ్గర కూర్చుని రోదిస్తూ కనిపిస్తుంది.
ఆలయ ప్రాంగణంలో ఆ దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. అక్కడి స్వామి దర్శనం కోసం ఆ కుటుంబం వచ్చిందనీ, అనుకోకుండా అ కుటుంబ యజమాని మృత్యువాత పడ్డాడని తెలుసుకుంటాడు. చనిపోయిన వ్యక్తి భార్యా బిడ్డల రోదన ఆయనకి ఎంతగానో ఆవేదన కలిగిస్తుంది. దాంతో నేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామి సన్నిధిలో కూర్చుంటాడు.
దైవ దర్శనం కోసం వచ్చిన వ్యక్తి ... ఆలయ ప్రాంగణంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల బాధను వ్యక్తం చేస్తాడు. దేవుడు అండగా నిలుస్తాడనే ఆశతో వచ్చిన భక్తులు ఆధారాన్ని కోల్పోయేలా చేయడం న్యాయమా ? అంటూ ఆర్తితో అడుగుతాడు. ఆశ్రయించడానికి వచ్చిన వాళ్లకి తీరని దుఃఖాన్ని మిగల్చవద్దనీ, ఆ వ్యక్తికి ప్రాణాలు పోయమని స్వామిని వేడుకుంటాడు.
త్యాగయ్య విన్నపాన్ని స్వామి ఆలకించినట్టుగా, అప్పటి వరకూ నిర్జీవంగా పడివున్న వ్యక్తి దేహంలో కదలిక మొదలవుతుంది. నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్టుగా ఆ వ్యక్తి లేచి కూర్చుంటాడు. అక్కడి వాళ్లంతా త్యాగయ్యకి భగవంతుడితో గల అనుబంధాన్ని చూసి ఆశ్చర్యపోతారు. జీవించిన వ్యక్తితో పాటు ఆయన భార్యాబిడ్డలు ఆనందంతో పొంగిపోతారు. త్యాగయ్య పాదాలపై పడి కన్నీళ్లతో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.