సంతోషాలను అందించే అమ్మవారు
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనునిత్యం తన భక్తులను కనిపెట్టుకుని వుండటం కోసం వివిధ రూపాలను ధరించింది. అనేక నామాలతో పిలవబడుతూ ఆరాధించబడుతోంది. ఈ నేపథ్యంలో అమ్మవారు ఒక్కోచోట ఒక్కో రూపంలో తన భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. అమ్మవారు ఎక్కడ ఏ పేరుతో వున్నా ... ఏ రూపంలో వున్నా సౌభాగ్యాన్ని రక్షిస్తుందనీ ... సంపదలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
ఈ కారణంగానే అమ్మవారి ఆలయాలను మహిళా భక్తులు ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు చేయిస్తూ, ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ వుంటారు. ఇక శ్రావణమాసం వచ్చిందంటే అమ్మవారి ఆలయాలు భక్తులచే సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటిగా హస్తినాపురం నార్త్ కి చెందిన సంతోషిమాత ఆలయం దర్శనమిస్తుంది.
హైదరాబాద్ - సరూర్ నగర్ మండలం పరిధిలో ఈ ఆలయం అలరారుతోంది. అమ్మవారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అవకాశం వుంటుంది. అలాగే సామూహిక సంతోషిమాత వ్రతాలను నిర్వహించడానికి వీలుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు - వేపచెట్టు ఒకటిగా కలిసిపోయి కనిపిస్తాయి. ఇక్కడి వేదికపై గల శివలింగం ... జంటనాగులను భక్తులు స్వయంగా పూజిస్తూ వుంటారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తూ వుండగా ఎడమవైపున వినాయకుడు కొలువై వుంటాడు.
ఇక గర్భాలయంలో సంతోషిమాత పాలరాతిమూర్తి కళకళలాడుతూ కనిపిస్తుంది. విశాలమైన నేత్రాలతో ... మెరిసే ముక్కెరతో చిరునవ్వులు చిందిస్తూ వుంటుంది. వివిధ రకాల పూలమాలికలతో ... ఆభరణాలతో వెలుగొందుతూ దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుంటుంది. ఇక్కడి అమ్మవారు సౌభాగ్యాన్ని కాపాడుతుందనీ, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుందని భక్తులు చెబుతుంటారు. దుఃఖాలను దూరంచేసి నిత్య సంతోషాలను అందిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.