అహంకారం వదిలితేనే అనుగ్రహం

భగవంతుడి కను సన్నలలోనే గ్రహాలూ సంచరిస్తూ వుంటాయి ... కాలం పరిగెడుతూ వుంటుంది. జనన మరణాలు సంభవిస్తూ వుంటాయి ... ఆ రెండింటికీ మధ్య కర్మ ఫలితాలను జీవులు అనుభవిస్తూ వుంటారు. భగవంతుడు సృష్టించనిదీ ... ఆయనకి సంబంధం లేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అందుకే భగవంతుడు సర్వానికి యజమాని అని చెప్పడం జరుగుతోంది.

మంచిదారిలో నడిచేవారికి ఆయన తన సహాయ సహకారాలను అందిస్తూనే వుంటాడు. చెడు మార్గంలో ప్రయాణించేవాళ్లను కూడా తొందరపడి దండించడు. వాళ్లు మంచి విలువ తెలుసుకుని ఆ దారిలోకి ప్రవేశించేలా కొన్ని పరిస్థితులను కల్పిస్తాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా అహంకారానికి పోతే, అందుకు తగిన ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. అహంకారంతో మిడిసి పడుతూ భగవంతుడిని దూషించిన కొందరు చివరికి ఎలాంటి ఫలితాన్ని అనుభవించారనేది పురాణాల్లోను ... ఇతిహాసాల్లోను కనిపిస్తూ వుంటుంది.

తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం కొందరు భగవంతుడి శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్లకి మరోమారు ఆ అవకాశం లేకుండా పశువులుగా ... పక్షులుగా జన్మిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అప్పుడు కూడా పశ్చాత్తాపం చెందకపోతే, మరింత హీన జాతులలో జన్మించావలసి వస్తుంది. అందుకే అహంకారం వదులుకోవాలి ... అప్పుడే భగవంతుడి నీడలో చోటు దొరుకుతుంది. అన్నింటికీ ఆధారభూతమైన భగవంతుడిని అనునిత్యం సేవించడం వలన ఉత్తమమైన జన్మ లభిస్తుంది.


More Bhakti News