అదే పరమాత్ముడి గొప్పతనం !
శ్రీకృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకూ ఆయన జీవితంలో అనేక లీలా విశేషాలు కనిపిస్తాయి. బాలకృష్ణుడిగా ముద్దులొలికే ఆయన రూపం ప్రతి ఒక్కరి మనసులను కట్టిపడేస్తుంది. లోకంలో ప్రతి తల్లి కూడా తన బిడ్డను ఒక్కసారైనా చిన్నికృష్ణుడిగా ముస్తాబు చేసుకుని చూసుకుంటుంది ... మురిసిపోతుంది.
అంతగా ముద్దులొలికే ప్రాయంలోనే ఆయన అనేకమంది అసురులను సంహరించాడు. ఈ జాబితాలోనే మనకి పూతన కూడా కనిపిస్తుంది. బాలకృష్ణుడిని అంతం చేయడానికి వచ్చిన 'పూతన' .. ఆయన చేతిలో వధించబడుతుంది. తనని సంహరించే బాలకుడు మరోచోట పెరుగుతున్నాడని తెలిసిన కంసుడు, ఆ బాలకుడి ఆచూకీ తెలుసుకుని అంతం చేయమని చెప్పి అసురులను పంపిస్తాడు.
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణుడిని హతమార్చడానికి పూతన వస్తుంది. పొరుగింటి స్త్రీగా మారువేషంలో కృష్ణుడిని అక్కున చేర్చుకుని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. బాలకృష్ణుడు ఆమె చనుబాలను తాగుతూనే సంహరిస్తాడు. స్త్రీని వధించకూడదనే నియమాన్ని కృష్ణుడు ఉల్లంఘించలేదు. పూతన స్త్రీయనే కృతజ్ఞతతోనే ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
పూతన చనిపోయిన తరువాత అందరూ చూస్తుండగానే ఆమె దేహం ఒక వింత కాంతిని సంతరించుకుని, చక్కని పరిమళాన్ని వెదజల్లుతూ అదృశ్యమైపోయిందట. దీనిని బట్టే శ్రీ కృష్ణుడు ఆమెకి మోక్షాన్ని ప్రసాదించాడని చెప్పబడుతోంది. సాధారణంగా తమ ప్రాణాలకు హాని తలపెట్టిన వాళ్లకు మంచి చేయాలని ఎవరూ అనుకోరు. అలాంటిది తనని అంతం చేయడానికి వచ్చిన పూతనకు మోక్షాన్నే ప్రసాదించడం వలన పరమాత్ముడి ఔన్నత్యం మరోమారు ఆవిష్కరించబడింది.