సాక్ష్యం చెప్పిన సదాశివుడు !

తననే నమ్ముకున్న భక్తులను కాపాడటం కోసం, భగవంతుడే సాక్షిగా మారిన సంఘటనలు కొన్ని క్షేత్రాల్లో జరిగాయి. అలాంటి సంఘటనలు అక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విషయాన్ని నిరూపిస్తూ వుంటాయి. అలాంటి సంఘటనలకు వేదికగా నిలిచిన క్షేత్రాల్లో 'త్రిపురాంతకం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. పార్వతీ పరమేశ్వరులు, త్రిపురాంతకేశ్వరుడు - త్రిపురసుందరీదేవి పేరుతో ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

అత్యంత శక్తిమంతమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి స్వామి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా చాలాకాలం క్రిందట జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావిస్తూ వుంటారు. ఒకప్పుడు స్వామివారి సమక్షంలో జరుగుతోన్న అన్యాయాన్ని శివభక్తుడైన ఒక వ్యక్తి అడ్డుకున్నాడట. ఫలితంగా గొడవ పెద్దదై పోవడమే కాకుండా, నిజానిజాలు తేల్చడం కోసం ఆలయ ప్రాంగణంలోనే పంచాయతి ఏర్పాటు చేయడం జరిగింది.

శివభక్తుడు జరిగిన సంఘటన గురించి పంచాయతీ పెద్దలకు వివరిస్తాడు. అయితే అందుకు సాక్ష్యం కావాలనీ ... లేదంటే శిక్షను అనుభవించక తప్పదని వాళ్లు తేల్చేస్తారు. ఆ సంఘటన జరిగిన సమయంలో గర్భాలయంలో త్రిపురాంతకుడు తప్ప మరెవరూ లేరనీ, తాను చెప్పింది నిజమే అయితే ఆయనే వచ్చి సాక్ష్యం చెబుతాడని అంటాడు.

అప్పుడు గర్భాలయం నిండుగా ఒక కాంతి ఆవిష్కరించబడి ... అతను చెబుతున్నది నిజమేననీ, అందుకు తాను సాక్ష్యమనే మాటలు లోపలి నుంచి వినిపిస్తాయి. అంతే ఒక్కసారిగా ఊళ్లో వాళ్లందరికీ అది కలో ... నిజమో అర్థం కాలేదు. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆనందంతో పొంగిపోయారు. తమ తప్పుని మన్నించమని ఆ శివభక్తుడిని కోరడమే కాకుండా, నాటి నుంచి మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించడం ఆరంభించారు.


More Bhakti News