ఆసక్తిని కలిగించే సాయిలీలలు

కొంతమంది భక్తుల దగ్గర బాబా పునర్జన్మల గురించిన విషయాలను ప్రస్తావించేవాడు. తనతో అత్యంత సన్నిహితంగా మెలిగే కొంతమంది భక్తులు, గత జన్మలో కూడా తనతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి వున్నారని చెప్పేవాడు. పూర్వజన్మలో విషయాలు వాళ్లకి గుర్తుండే అవకాశం లేదు కనుక, తాను గుర్తుచేస్తున్నానని అనేవాడు. ఇక కీటకాలు ... పశువులు ... జంతువుల గత జన్మలను గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పేవాడు.

ఆయన సన్నిహితులంతా ఆ విషయాలను ఆసక్తిగా వింటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసే వాళ్లు. ఒకసారి ఒక పాము ఒక కప్పని మింగడానికి వస్తూ వుండగా అది భయంతో అరవసాగింది. ఆ దృశ్యం బాబా కంట పడటంతో, ఆయన మనుషులకు నచ్చజెప్పినట్టుగానే వాటికి నచ్చజెప్పి పంపించి వేస్తాడు.

ఆ విషయాన్ని గురించి అక్కడి వాళ్లు అడగగా, గత జన్మలో వాళ్ల పేర్లతో సహా ప్రస్తావిస్తూ ... అప్పట్లో వాళ్లు బద్ధశత్రువులనీ ... ఈ జన్మలోను ఆ వైరం కొనసాగుతోందని చెబుతాడు. మరోమారు తన మశీదు వైపు ఒక వ్యక్తి మేకల మంద తోలుకు వస్తూ వుండగా, అందులో రెండు మేకలను ఎక్కువ ధరకే కొని, వాటికి కడుపు నిండుగా ఆహరం పెట్టి వదిలేస్తాడు.

అందుకు కారణమేమిటని అక్కడి వాళ్లు అడిగితే, పూర్వజన్మలో తనకి బాగా తెలిసిన వాళ్లే ఇలా మేకలుగా జన్మించారనీ, ఆ అనుబంధం కారణంగానే అలా చేశానని అంటాడు. మరోసారి తమకి బతుకు తెరువుగా వున్న పెద్దపులి జబ్బుపడటంతో, దానికి సంబంధించిన వాళ్లు బాబా దగ్గరికి తీసుకు వస్తారు. బాబా దాని వైపు ఆప్యాయంగా చూస్తాడు. అది కూడా ఆయన పట్ల వినయాన్ని ప్రదర్శిస్తూ ఆయన సన్నిధిలో ప్రాణాలు వదులుతుంది.

ఈ దృశ్యం చూస్తున్న వాళ్లందరికీ ఈ పులికి గత జన్మలో బాబాతో అనుబంధం వుండి ఉంటుందనే విషయం అర్థమైపోతుంది. అలా బాబా ఈ జన్మలో భవిష్యత్తుకి సంబంధించిన విషయాలనే కాదు, పూర్వజన్మ విషయాలను కూడా ప్రస్తావిస్తూ తన భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగించేవాడు.


More Bhakti News