సంతానమిచ్చే వేణుగోపాలుడు
కృష్ణ భగవానుడి లీలావిశేషాలను గురించి ఎంతగా విన్నా ఇంకా వినాలనిపిస్తూనే వుంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన నడిపించిన కథా కథనాలు అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటాయి. అద్భుతమైన ఆ ఘట్టాలను గురించి వింటూ వుంటూనే, మనోహరమైన దృశ్య రూపాలుగా అవి కనులముందు కదలాడుతూ వుంటాయి.
తన వేణుగానంతో గోవులను ... గోపాలకులను ... గోపికలను మంత్రముగ్ధులను చేసిన కృష్ణుడు, వేణుగోపాలుడిగా అనేక ప్రదేశాల్లో కొలువుదీరి వేల వరాలను ప్రసాదిస్తున్నాడు. అలాంటి వేణుగోపాలస్వామి ఆలయాలలో ఒకటి 'వేములమడ'లో కనిపిస్తుంది. కృష్ణా జిల్లా 'మువ్వ' మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెబుతుంటారు.
పూర్వం ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడికి వేణుగోపాలుడు స్వప్నంలో కనిపించి, తాను ఫలానా గ్రామంలో ఆదరణ లేకుండా ఉన్నాననీ, తనని తీసుకువెళ్లి ఆలయాన్ని నిర్మించి పూజాభిషేకాలు జరిగేలా చూడమని చెప్పాడట. మరునాడు తనకి వచ్చిన కలను గురించి ఆయన ఆ గ్రామస్తులకు చెప్పాడు. ఆ కల నిజమో కాదో తెలుసుకోవడం కోసం, కలలో కృష్ణుడు చెప్పిన గ్రామానికి వెళ్లి చూశారు. నిజంగానే అక్కడ పూజలకు నోచుకోని కృష్ణుడి విగ్రహం కనిపించింది.
నయన మనోహరంగా వున్న ఆయన రూపం వాళ్లని కాసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు ... కనురెప్ప వేయనీయలేదు. ఆ తరువాత ఈ లోకంలోకి వచ్చి ఆ విగ్రహాన్ని తమ గ్రామానికి తరలించి .. ఆలయాన్ని నిర్మించి .. అందులో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఇక్కడి స్వామిని అంతా తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వుంటారు. కాలక్రమంలో స్వామివారి సన్నిధిలో రుక్మిణీ సత్యభామలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది.
ఇక్కడి భక్తులు పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... విశేష సేవలు జరిపిస్తూ, ఆయన వైభవం తగ్గకుండా చూస్తుంటారు. తమ కోసం తమ గ్రామానికి తరలివచ్చిన వేణుగోపాలుడు మహిమాన్వితుడని చెబుతుంటారు. సంతాన లేమితో బాధపడుతోన్న వాళ్లు ఆయనని దర్శిస్తే, సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని సంతాన వేణుగోపాలస్వామిగా పిలుచుకుంటూ వుంటారు. అనునిత్యం ఆ స్వామిని అంకిత భావంతో సేవిస్తూ తరిస్తుంటారు.