నమస్కార ఫలితం విజయమే !
సీతాదేవిని అన్వేషిస్తూ బయలుదేరిన హనుమంతుడు లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడి ఎత్తైన భవనాలను ... అందమైన ఉద్యానవనాలను ... ప్రజల విలాసవంతమైన జీవన విధానాన్ని చూస్తాడు. అయితే సీతాదేవి ఎక్కడ ఉన్నదనే విషయాన్ని మాత్రం ఆయన కనుక్కోలేక పోతుంటాడు. ఆమెను వెతుకుతూ చెట్లపై నుంచి చెట్ల పైకి ... భవనాల పైనుంచి భవనాలపైకి దూకుతూ తిరుగుతుంటాడు.
అయినా సీతాదేవి జాడను మాత్రం తెలుసుకోలేకపోతుంటాడు. అత్యంత కష్టసాధ్యమైన సముద్రాన్నే దాటుకుని వచ్చిన తాను, సీతాదేవి జాడ కనుక్కోలేక పోవడం ఆయనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆయనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. తాను సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతూ, అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని సూర్య భగవానుడికీ ... వాయుదేవుడికి మనసులోనే నమస్కరించిన విషయం గుర్తొస్తుంది.
వాళ్ల ఆశీస్సుల కారణంగానే తాను సముద్రాన్ని దాటగలిగానని ఆయన అనుకుంటాడు. అలా వచ్చిన తాను సీతాదేవి జాడను కనుక్కోలేకపోతున్నానంటే కారణమేవైవుంటుందా అని ఆలోచిస్తాడు. తాను లంకా నగరంలోకి ప్రవేశిస్తూ, అక్కడ తన అన్వేషణ ఫలించేలా చేయమని శ్రీరాముడికి మనసులో నమస్కరించకపోవడమే అందుకు కారణమై ఉంటుందని గ్రహిస్తాడు. వెంటనే మనసులో శ్రీరామచంద్రుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి కదులుతాడు.
అంతే .. అశోకవనంలో బందీగా వున్న సీతాదేవి ఆయనకి కనిపిస్తుంది. నమస్కార ఫలితం ఎలా ఉంటుందనేది హనుమంతుడికి మరోమారు అర్థమవుతుంది. అందుకే ఏదైనా కార్యాన్ని ఆరంభించడానికి బయలుదేరేటప్పుడు పెద్దలకు నమస్కరించి వెళ్లడమనేది ఒక ఆచారంగా వస్తోంది. పెద్దలకు నమస్కరించి వాళ్ల ఆశీస్సులతో ఆరంభించే పనులు సఫలీకృతమవుతాయనీ, విజయంతో తిరిగిరావడం జరుగుతుందని చెప్పబడుతోంది.