ఏనుగుని అధిరోహించిన వేంకటేశ్వరుడు !
సాధారణంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలు కొండలపైనే దర్శనమిస్తూ వుంటాయి. చుట్టూ పచ్చదనం ... చల్లని గాలి ... ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించడం ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అలా పచ్చని ప్రకృతి మధ్యలో కుదురుగా కనిపించే ఓ కొండపై వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన క్షేత్రం 'అమ్మపేట'లో కనిపిస్తుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. అలమేలు మంగా సమేతంగా స్వామివారు ఇక్కడ కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. సాధారణంగా కొన్ని కొండలను చూసినప్పుడు అవి వివిధ ఆకారాలను సంతరించుకుని ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి.
అలాగే ఇక్కడి కొండ ఒక ప్రదేశం నుంచి చూస్తే .. ఉత్సవాల సమయంలో స్వామివారిని అంబారిపై కూర్చోబెడుతూ వుండగా, ఏనుగు ఎలా కాళ్లపై కూర్చుంటుందో అలా కనిపిస్తూ వుంటుంది. కొండపై గల ఆలయం అంబారిపై ఏర్పాటు చేసిన మందిరంలా అనిపిస్తూ వుంటుంది. ఏనుగే శిలగా మారిపోయిందా అన్నంత సహజంగా ఈ దృశ్యం కనిపిస్తూ వుంటుంది. లక్ష్మీనారాయణుల సేవలో ఏనుగులు తరించాయి. అందుకు కృతజ్ఞతగా స్వామివారు ఇప్పటికీ అనేక క్షేత్రాల్లో గజ వాహనంపై ఊరేగుతుంటాడు.
ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఏనుగు ... శిలా రూపంలో ఇక్కడ స్వామివారిని మోస్తున్న కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతుంటారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ గజవాహన సేవను ఘనంగా నిర్వహిస్తూ వుండటం విశేషం. ఈ సేవలో పాల్గొనడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.