నాగదేవతను ఆరాధించమన్న విష్ణుమూర్తి
లోకంలో విషపూరితమైన సర్పజాతులు అనేకం వున్నాయి. వాటిలో కొన్ని రకాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ వుంటాయి. మరికొన్ని రకాలు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటాయి. ఊరికి దగ్గరలోనే పొలాలు .. చేలు .. వుండటం వలన, వాటికి అవసరమైన ఆహారం ఈ ప్రదేశాల్లో లభిస్తూ వుండటం వలన పాములు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి.
పాములకు దగ్గరగా తమ జీవితం కొనసాగుతూ వుండటం వలన, తమకి హాని చేయవద్దని కోరుతూ వాళ్లు నాగపూజ చేస్తుంటారు. పాము వలన తమ ప్రాణాలకి ప్రమాదమని భావించి, వాటిని అంతం చేయడానికి మాత్రం చాలామంది సాహసించరు. ఎందుకంటే పాములను కొట్ట కూడదనీ ... వాటిని దేవతలుగా భావించి పూజించాలని తమ పూర్వీకుల నుంచి వాళ్లు వింటూ రావడమే అందుకు కారణం.
నాగుపాములు పూజలు అందుకోవడానికి ఒక కారణముందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వైకుంఠంలో ఆదిశేషుడిపై పవళించే విష్ణుమూర్తి, ఎంతోకాలంగా తనకి ఆదిశేషుడు చేస్తోన్న సేవకుమెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగాడట. శ్రావణ శుద్ధ పంచమి రోజున మానవాళిచే సర్పజాతి పూజలు అందుకునేలా చేయమని ఆదిశేషుడు వరాన్ని కోరుకున్నాడు.
అందుకు స్వామి అంగీకరించడమే కాకుండా, ఈ రోజున ఎవరైతే నాగారాధన చేస్తారో వాళ్లకి విష బాధలు కలగకుండా సకల శుభాలు చేకూరతాయని సెలవిచ్చాడట. ఆనాటి నుంచి శ్రావణ శుద్ధ పంచమి 'నాగపంచమి'గా పిలవబడుతూ ... నాగారాధన జరుగుతూ వస్తోంది.