కోరిన వరాలనిచ్చే కొండంత దేవుడు
సత్యధర్మాలకు ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి ఇది. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అన్నివిషయాల్లోనూ ... అన్ని సమయాల్లోను ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆదర్శాన్ని ఆవిష్కరించినవాడాయన. అందుకే రాముడు అందరి మనసుల్లోను పుణ్యపురుషుడుగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందువల్లనే ప్రాచీనకాలం నుంచి రామాలయాలు వైభవంగా వెలుగొందుతూ వున్నాయి.
అలా ప్రాచీన నేపథ్యాన్ని సంతరించుకుని, భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం 'మాధవ వరం' లో దర్శనమిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో గల ఈ క్షేత్రం విశేషమైనదిగా చెప్పబడుతోంది. వైశాల్యం పరంగాను ... ప్రాకారాలు ... ప్రాకారమంటపాలు ... ప్రధాన మంటపం నిర్మాణ పరంగాను ఈ క్షేత్రం తన ఘనతను చాటుకుంటూ వుంటుంది. విశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని కలిగి వుండటం వలన, ఇక్కడ ప్రదక్షిణలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.
గర్భాలయంలో హనుమంతుడితో సహా సీతారామలక్ష్మణులు దర్శనమిస్తూ వుంటారు. ఇదే ప్రాంగణంలో పరమశివుడు పార్వతీదేవి సమేతంగా దర్శనమిస్తూ వుంటాడు. శివకేశవులు కొలువుదీరిన ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు వ్యవహరిస్తూ వుంటాడు. అందుకు నిదర్శనంగా ఆయన ప్రత్యేక మందిరంలో కొలువై కనిపిస్తుంటాడు. విశేషమైన పుణ్య తిథుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది.
శివుడు ... ఆయనకి ఎంతో ఇష్టమైన రాముడు ... ఆయనకి ప్రాణ సమానమైన హనుమంతుడు కొలువైన కారణంగా ఇది ఎంతో విశిష్టతను సంతరించుకుని విరాజిల్లుతోంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సకల శుభాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.