సీతారాములు అనుగ్రహించిన వేళ !
ఒక రోజున త్యాగయ్య ఇంటికి నడి వయసులో వున్న భార్యాభర్తలు వస్తారు. తాము యాత్రీకులమనీ, వివిధ క్షేత్రాలను దర్శిస్తూ వస్తున్నామని చెబుతారు. ఆ గ్రామంలోకి అడుగు పెట్టగానే త్యాగయ్యను గురించి విన్నామనీ, ఆయనని చూడాలనిపించి వచ్చామని చెబుతారు. త్యాగయ్య దంపతులు వాళ్లని సాదరంగా ఆహ్వానిస్తారు. తమ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లవలసిందిగా కోరతారు.
భోజనాలు అయిన అనంతరం ... వాళ్లు త్యాగయ్య కుటుం పరిస్థితులను గురించి ప్రస్తావిస్తారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, ఆయన రాజుగారి కానుకలను తిప్పి పంపించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. తనకి ఏదో కావాలో రాముడికి తెలుసనీ ... ఆయనని కాదని ఇతరులను ఆశ్రయించడం తనకి అలవాటు లేదని చెబుతాడు త్యాగయ్య.
ఆ భార్యా భర్తల కోరికపై శ్రీరాముడిపై ఆయన ఒక కీర్తన ఆలపిస్తాడు. ఆయన గానానికి ఆ భార్యాభర్తలు పరవశించిపోతారు. ఆయన గానం సీతారాముల మనసు గెలుచుకునే ఉంటుందనీ, వాళ్ల అనుగ్రహం తప్పక లభిస్తుందని ఆ అతిథులు అక్కడి నుంచి బయలుదేరుతారు. వచ్చింది సాక్షాత్తు సీతారాములేనని తెలియక పోయినా గుమ్మం వరకూ వెళ్లి వాళ్లను సాగనంపుతాడు త్యాగయ్య.