ధర్మం వైపు నిలిచే దేవుడు
భగవంతుడు ధర్మ పక్షపాతి ... ధర్మం ఎక్కడ వుంటే ఆయన అక్కడ వుంటాడు. అధర్మం ఎక్కడ వుంటే అక్కడికి వెళ్లి దాన్ని అంతం చేస్తుంటాడు. ధర్మమే ప్రజలను శాంతి మార్గంలో నడిపిస్తుంది. శాంతమే ప్రజల మధ్య సఖ్యతను పెంపొందింపజేస్తుంది. సఖ్యత వలన ప్రజల జీవనవిధానం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. సంతోషమనేది ప్రజలను మరింత చైతన్య వంతులను చేస్తుంది. చైతన్యం కారణంగా ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంటుంది.
ఇలా లోక కల్యాణమనేది ధర్మంపైనే ఆధారపడి వుంటుంది. అందుకే అలాంటి ధర్మానికి హాని తలపెట్టడానికి ఎవరు ప్రయత్నించినా భగవంతుడు సహించడు. అధర్మ మార్గంలో ప్రజలను ప్రభావితం చేయడానికి ఎవరైనా సాహసిస్తే ఎంతమాత్రం ఆలస్యం చేయడు. ధర్మమార్గాన్ని అనుసరిస్తోన్నవారికి అండగా నిలుస్తూ, అధర్మాన్ని ఆశ్రయించిన వారికి అపజయం తప్పదని నిరూపిస్తూ వుంటాడు.
అంతిమ విజయం ధర్మానిదే అని లోకానికి చాటడం కోసం శ్రీకృష్ణుడు .. పాండవులకు అండగా నిలిచాడు. ఈ కారణంగానే కొంతమంది ఆయనని పాండవుల పక్షపాతి అని చెప్పుకున్నారు. కానీ నిజానికి శ్రీకృష్ణుడు ... పాండవుల పక్షపాతి కాదు ... ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మాన్ని ఆశ్రయించారు కనుక, ఆయన వారికి అండగా నిలిచాడు. కౌరవులు అధర్మ మార్గాన్ని అనుసరించారు కనుక దాని ఫలితాన్ని వాళ్లు అనుభవించేలా చేశాడు.