శివారాధనకి ఆటంకం కలిగిస్తే ?
పరమశివుడు తన భక్తులను ఇబ్బందులకు గురిచేసినా ... వారి ఆరాధనకు ఆటంకాలను సృష్టించినా ఎంతమాత్రం సహించడు. ఆదిదేవుడు భక్తుల పట్ల ఎంత కరుణ కురిపిస్తాడో, ఆ భక్తుల ఆరాధనకి అడ్డుపడినవారి పట్ల అంత నిర్దయగానూ వ్యవహరిస్తూ వుంటాడు. మార్కండేయుడి జీవితంలోని ఓ సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.
మార్కండేయుడి వయసు పదహారు సంవత్సరాలు పూర్తికావొస్తూ ఉండటంతో, ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేయసాగాడు. ఇతరుల తపస్సుకు భంగం కలిగించే దేవేంద్రుడు, అలవాటు ప్రకారం మార్కండేయుడి తపస్సు కూడా ఫలించకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా ... మార్కండేయుడి మనసుని మళ్లించమని చెప్పి ఓ అప్సరసను ఆదేశిస్తాడు.
అప్పుడప్పుడే యవ్వన దశలోకి అడుగుపెడుతోన్న మార్కండేయుడి తపస్సుకి భంగం కలిగించడానికి ఆ అప్సరస అయిష్టతను వ్యక్తం చేస్తుంది. అమరలోకంలో ఆమెకి స్థానం లేకుండా చేస్తానని దేవేంద్రుడు హెచ్చరించడంతో అయిష్టంగానే అందుకు సిద్ధపడుతుంది. మార్కండేయుడి శివారాధనకు అడ్డుపడి, శివాగ్రహానికి గురవుతుంది. ఫలితంగా ఆమె రూపం వికృతంగా మారిపోతుంది.
బాధతో ఆమె విలపిస్తూ వుండగా ఈ లోకంలోకి వచ్చిన మార్కండేయుడు, విషయం తెలుసుకుంటాడు. అజ్ఞానంతో ఆమె చేసిన పనిని క్షమించి, పూర్వ రూపాన్ని ప్రసాదించమని శివుడిని కోరతాడు. దాంతో పూర్వ రూపాన్ని పొందిన అప్సరస ఆనందంతో పొంగిపోతుంది. తన తప్పును మన్నించమంటూ మార్కండేయుడి పాదాలకు నమస్కరిస్తుంది.