త్రిశక్తి మాతలు కొలువైన క్షేత్రం

అమ్మా ... అనే మాటలో ఆత్మీయత వుంటుంది ... ఆనందం వుంటుంది ... అనిర్వచనీయమైన అనుభూతి వుంటుంది. అమ్మా అని పిలవగానే తల్లి మనసు కరిగిపోతుంది ... మురిసిపోతుంది ... బిడ్డల అవసరాలు తీర్చడానికి పరుగుపరుగున వస్తుంది. అలాంటి అమ్మలగన్న అమ్మగా ... ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక ప్రదేశాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ - వనస్థలిపురంలోని వెంకటరమణ కాలనీ యందు శ్రీరాజరాజేశ్వరీ పీఠం దర్శనమిస్తూ వుంటుంది. సువిశాలమైన ప్రదేశంలో ధూళిపాళ విజయానందనాథ నిర్మించిన ఈ ఆలయం, కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన జరుపుకుంది.

ప్రధాన ఆలయంలో ప్రత్యేకమైన గర్భాలయాల్లో అష్టాదశ భుజాలతో మహాలక్ష్మీదేవి ... విజయదుర్గాదేవి ... జ్ఞానసరస్వతీదేవి వరుసగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటారు. పరివార దేవతలుగా శక్తి గణపతి ... రమాసహిత సత్యనారాయణ స్వామి ... సీతారాములు ... స్వయంవర కళాగౌరీ ... బాలాత్రిపురసుందరి దర్శనమిస్తూ వుంటారు.

జ్ఞానాన్ని .. సంపదలను ... సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవార్లతో ఈ ఆలయం అలరారుతూ వుంటుంది. శ్రావణ ... కార్తీక మాసాల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. వివిధ కారాణాల వలన వివాహం ఆలస్యమవుతూ వుంటే, ఇక్కడి స్వయంవర కళాగౌరిని దర్శించుకోవాలని చెబుతుంటారు. ఆ తల్లి దర్శన భాగ్యం కారణంగా అనతికాలంలోనే వివాహం జరుగుతుందని అంటారు. త్రిశక్తి మాతలు కొలువైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News