మంగళగౌరి అనుగ్రహం అందుకోవాలి
మంగళగౌరి అనే పేరే మంగళకరమైనదిగా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని అందించే మంగళవారం .. శ్రావణమాసంలో అత్యంత శుభప్రదమైనదిగా చెప్పబడుతోంది. వివాహమైన యువతులు ఆ ఏడాది నుంచి అయిదు సంవత్సరాల పాటు 'మంగళగౌరి నోము'ను ఆచరిస్తుంటారు. ఈవిధంగా చేయడం వలన కలకాలం సౌభాగ్యంతో వర్ధిల్లుతారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడుతూ వారికి సంపదలను సైతం ప్రసాదించే ఈ నోమును గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ... ద్రౌపతితో చెప్పి చేయించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. గౌరీదేవిని పూజించడం వలన సౌభాగ్యం మాత్రమే కాదు, ఆ కుటుంబీకులకు అనేక విజయాలు దక్కుతాయని చెప్పబడుతోంది. ఆ కుటుంబంలో ఎవరు ఎలాంటి కార్యాన్ని తలపెట్టినా, అమ్మవారి అనుగ్రహంతో అది తప్పక విజయవంతమవుతుందని అంటారు.
సాక్షాత్తు సదాశివుడే .. త్రిపురాసుర సంహారం సమయంలో గౌరీదేవిని పూజించి రంగంలోకి దిగాడట. ఈ కారణంగానే ఆయన విజయాన్ని సాధించాడని అంటారు. ఇక మంగళగౌరి నోములకు కన్యలు కూడా తప్పకుండా వెళుతూ వుండాలి. ఈ నోము సందర్భంలో తయారు చేయబడిన కాటుకను ధరించడం వలన అనతికాలంలోనే వారికి వివాహమవుతుందని అంటారు.
ఇలా అమ్మవారు ఇన్ని విధాలుగా ప్రభావితం చేస్తూ, స్త్రీ జీవితానికి ఒక పరిపూర్ణతను సిద్ధింపజేస్తోంది. అందువలన ప్రతి యువతి తప్పని సరిగా శ్రావణ మంగళవారపు నోములో పాలుపంచుకోవాలి. సుఖశాంతులతో కూడిన జీవితాన్ని ఆ తల్లి అనుగ్రహంగా అందుకోవాలి.