అచెంచలమైన విశ్వాసమంటే అదే !

భగవంతుడు వస్తాడు ... తనని రక్షిస్తాడు అనే భక్తుల అచెంచలమైన విశ్వాసమే వారిని కాపాడుతూ వచ్చిన సందర్భాలు ఎన్నోవున్నాయి. భగవంతుడి పట్ల అంతటి అసమానమైన నమ్మకాన్ని ప్రదర్శించిన మహా భక్తులలో ఒకరుగా 'రామదాసు' కనిపిస్తాడు. ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ముతో, తన అనుమతి లేకుండా ఆలయాన్ని నిర్మించిన రామదాసును గోల్కొండ చెరసాలలో బంధిస్తారు.

రామదాసును చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిసి, భార్య కమల తల్లడిల్లిపోతుంది. నవాబు భార్యను కలుసుకుని ఆయనకి నచ్చజెప్పమని కోరుతుంది. నవాబుకి నచ్చజెప్పడం కష్టమని భావించిన ఆయన భార్య, రామదాసును రహస్యంగా అక్కడి నుంచి తప్పించాలని నిర్ణయించుకుంటుంది. ఒక రాత్రివేళ ఆయన కారాగారంలోకి ప్రవేశించిన చెలికత్తె, అక్కడి నుంచి వెంటనే పారిపోవలసిందిగా కోరుతుంది.

అలా ప్రాణాలపట్ల తీపితో పారిపోతే, తన రాకపట్ల తన భార్య కూడా ఆనందాన్ని వ్యక్తం చేయదని అంటాడు రామదాసు. తను పారిపోవడం వలన రామ భక్తులందరికీ ఆయనపై నమ్మకం లేకుండా పోతుందనీ, అలా జరగడానికి తాను ఎన్నడూ ఇష్టపడనని చెబుతాడు. అహల్యకి శాప విమోచనం కలిగించిన రాముడు ... శబరి ఎంగిలి పండ్లు తిన్న రాముడు ... గుహుడిని గుండెలకి హత్తుకున్న రాముడు తనని కాపాడకుండా ఎలా ఉంటాడని అడుగుతాడు.

ఎన్నో కష్టాలను ఎదుర్కున్న రాముడు ... కష్టాల్లో వున్న ఎంతోమందిని ఆదుకున్న రాముడు తన విషయంలో నిర్లిప్తంగా ఉండటానికి అవకాశమే లేదని అంటాడు రామదాసు. తన రాముడు తనని కాపాడటానికి తప్పకవస్తాడనే నమ్మకం ఉందనీ, ఆయన విడిపిస్తేనే తప్ప తాను ఆ చెరసాల నుంచి బయటికిరానని తేల్చి చెబుతాడు. అలా భగవంతుడిపై అపారమైన విశ్వాసాన్ని కలిగివుండి, ఆయనే స్వయంగా దిగివచ్చేలా చేసిన రామదాసు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.


More Bhakti News