పాపాలను హరించే పరమశివుడు

శివశివా అనగానే పాపాలు పటాపంచాలైపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది ఇక శివుడి పుణ్యక్షేత్రాల్లో అడుగుపెట్టడం వలన ... అక్కడి తీర్థంలో స్నానమాచరించడం వలన ... శివయ్యను దర్శించడం వలన ఎంతటి పుణ్యఫలాలు లభిస్తాయో అర్థంచేసుకోవచ్చు. అలా పుణ్యరాశిని పెంచుకుని భౌతిక బంధాల నుంచి విముక్తుని పొందాలనుకునే వాళ్లు, సదాశివుడి క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. అలాంటి భక్తులచే సందడిగా కనిపించే క్షేత్రాల్లో ఒకటిగా 'సాస్పాడ్' కనిపిస్తుంది.

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనదిగా చెబుతుంటారు. ఇక్కడి స్వామి 'సంగమేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ప్రాచీన కాలానికి చెందిన ఈ శివాలయం, ఆనాటి వైభవానికి ప్రతీకగా అలరారుతుంటుంది. వైశాల్యం పరంగాను ... నిర్మాణం పరంగాను, చారిత్రక ... ఆధ్యాత్మిక నేపథ్యం పరంగాను ఈ క్షేత్రం భక్తుల మనోఫలకంపై నిలిచిపోతుంది. గర్భాలయానికి ఎదురుగా నంది - భ్రుంగి కొలువుదీరి కనిపిస్తుంటాయి.

ఆలయం ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో నంది భారీ ఆకారంతో దర్శనమిస్తూ వుంటుంది. ఈ క్షేత్ర పర్యవేక్షణ బాధ్యత తాను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా ఈ నంది ఠీవీగా కనిపిస్తూ వుంటుంది. ముందుగా భక్తులు ఇక్కడి నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆలయంలోకి అడుగుపెడుతుంటారు. ఇక్కడి స్వామివారిని పూజించడం వలన, సమస్త పాపాలు నశించి సంతోషకరమైన జీవితం ఆరంభమవుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News