స్పటిక లింగ పూజా ఫలితం
ఎవరైనా సరే అవసరమొస్తే ప్రార్ధించేది ... ఆపద వస్తే అర్ధించేది ఆ ఉమాశంకరుడినే. ఆయన పశుపతి ... భక్తుల పక్షపాతి ... ఆర్తితో పిలిచినంతనే పలుకుతాడు. భక్తుల కష్ట నష్టాలను తొలగించి, సుఖశాంతులతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆ స్వామిని భక్తులు అధికంగా ఆరాధిస్తుంటారు ... విశేషంగా అభిషేకాదులు నిర్వహిస్తుంటారు.
ఆధ్యాత్మిక గ్రంధాలను పరిశీలిస్తే వివిధ రకాల శివలింగాల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఏ రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనేది అవి వివరిస్తూ వుంటాయి. అందుకు తగిన విధంగా ఆయా శివలింగాలను భక్తులు ఎంపిక చేసుకుని వాటిని అర్చించడంలో నిమగ్నమవుతుంటారు. ఈ నేపథ్యంలో బంగారం ... వెండి ... ఇత్తడి శివలింగాలతో పాటు, స్పటిక శివలింగాలను కూడా పూజామందిరంలో ఏర్పాటు చేసుకుంటూ వుంటారు.
స్పటిక శివలింగం అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతోంది. కొన్ని శివలింగాలను పూజించడం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం .. మోక్షం లభిస్తుంటాయి. ఇక స్పటిక శివలింగం దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక ప్రత్యేకత వుందని చెబుతుంటారు. ఫలానా కోరిక నెరవేరాలని సంకల్పించుకుని,దానిని అర్చించడం వలన మనసులోని ఆ కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని చెప్పబడుతోంది.