మహిమ చూపే సుబ్రహ్మణ్యస్వామి
పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తూ వుంటాడు. కొన్ని ప్రదేశాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి, మరికొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోను ... లింగాకారంలోను పూజలు అందుకుంటూ వుంటాడు.
అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది ... అదే 'అత్తిలి' సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. సుబ్రహ్మణ్యస్వామి మహిమలను గురించి కథలు కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో విలసిల్లుతోంది. స్వామివారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడి వారు ఆసక్తికరంగా చెబుతుంటారు.
చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది .. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రం బయటపడింది.
అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ వుంటుంది. స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.