అందుకే ఓంకారేశ్వరుడికి ఆ పేరు వచ్చింది

పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ... పంచారామాలు చెప్పబడుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించడం వలన మోక్షం ప్రసాదించబడుతుందని అంటారు. ఈ క్షేత్రాల్లో సదాశివుడు ఆవిర్భవించిన తీరు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది ... ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది.

జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతోన్న ఓంకారేశ్వరుడి విషయానికే వస్తే, ఇక్కడి స్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 'ఖాండ్వా' జిల్లాలో దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడ స్వామివారు కొండమీద ఓంకారేశ్వరుడుగా ... నర్మదా నదీ తీరంలో అమలేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

పరమపవిత్రమైనదిగా ... అత్యంత మహిమాన్వితమైనదిగా కనిపించే ఈ క్షేత్రంలో ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంటాడు. అలా అని చెప్పేసి ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే సరిపోదు. నదీ తీరంలో గల అమలేశ్వరుడుని కూడా తప్పక దర్శించుకోవలసి వుంటుంది. అప్పుడే ఈ క్షేత్రాన్ని దర్శించిన ఫలం పరిపూర్ణంగా లభిస్తుందని స్థలపురాణం చెబుతోంది.

సదాశివుడు ఇక్కడ ఓంకారేశ్వరుడుగా ఆవిర్భవించడానికీ ... ఈ క్షేత్రానికి ఓంకారేశ్వరం అనే పేరు రావడానికి కారణం 'మాంధాత' అని అని అంటారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన 'మాంధాత'కి .. ఇక్కడి పర్వతాన్ని తాకుతూ వెళుతోన్న నర్మదా నది ఓంకారం ఆకారంలో కనిపించడంతో, ఇది మహా మహిమాన్వితమైన ప్రదేశంగా భావించి, ఈ పర్వతంపై ఆదిదేవుడిని గురించి తపస్సు చేశాడట. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని 'మాంధాత పర్వతం' అని పిలుస్తుంటారు.

మాంధాత తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ ఓంకారేశ్వరుడుగాను, ఆయన అభ్యర్థన మేరకు నదీ తీరంలో అమలేశ్వరుడు గాను ఆవిర్భవించాడు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన పరమశివుడిని ప్రత్యక్షంగా సేవించిన అనుభూతి కలగడమే కాకుండా, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News