మాంగళ్యాన్ని రక్షించే మంగళగౌరి

సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పనిపై బయలుదేరవలసి వస్తే, ఆ రోజు మంగళవారం అనే విషయం గుర్తుకు రాగానే ఆ పనిని వాయిదా వేసుకుంటూ వుంటారు. ఇక శుభకార్యాల వంటివి నిర్వహించవలసి వస్తే, మంగళవారం కాకుండా, మిగతా వారాల గురించిన ఆలోచన చేస్తుంటారు. అలాంటి మంగళవారం శ్రావణమాసంలో ఎంతో ప్రత్యేకతను .. మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.

వివాహమైన యువతులు .. ఆ ఏడాది వచ్చే శ్రావణమాసంలో మంగళవారాల నోము నోచుకుంటూ వుంటారు. కలకాలం తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ పార్వతీదేవిని కోరుకోవడమే ఈ నోము ప్రధాన ఉద్దేశంగా చెప్పబడుతోంది. మంగళగౌరి నోము నోచుకునే యువతులతో ... నూతన వస్త్రాలను ధరించి అక్కడికి పేరంటానికి వెళ్లే ముత్తయిదువులతో ఇళ్లు ... వీధులు కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

ఇక ఈ రోజున అమ్మవారి ఆలయాలలోను భక్తుల సందడి బాగానే వుంటుంది. ఈ నోము నోచుకునేవారు పేరంటానికి వచ్చిన ప్రతి స్త్రీని అమ్మవారిగా భావించి వాయనాలు ఇవ్వడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ మాసంలో మంగళగౌరిని 'గౌరమ్మ' పేరుతో ప్రేమగా పిలుచుకుంటూ వుంటారు, గౌరమ్మకి సంబంధించిన కథలు చెప్పుకుంటూ ... పాటలు పాడుకుంటూ ఆ తల్లిపట్ల మనసును నిలుపుతుంటారు.

ఇక అనుకోని కారణాల వలన వివాహమైన మొదటి సంవత్సరం 'మంగళగౌరి' నోము నోచుకోవడం కుదరకపోతే, రెండవ సంవత్సరం వదిలేసి మూడవ సంవత్సరంలోనే నోచుకోవాలనే నియమం చెప్పబడుతోంది. శ్రావణమాసంలో మంగళవారం రోజున మంగళగౌరిని పూజించడం వలన మాంగళ్యం రక్షించబడుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో సౌభాగ్యం ... సంతానంతో కూడిన సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది.


More Bhakti News