అదే ఈ క్షేత్రం విశిష్టత !

సాధారణంగా ఎవరో ఒక మహర్షి అనేక ప్రాంతాలను దర్శిస్తూ, ఒకానొక పవిత్ర ప్రదేశాన్ని గుర్తించడం ... అక్కడ జపతపాలు ఆరంభించడం .. ఆ మహర్షికి స్వామివారు ప్రత్యక్ష దర్శనమివ్వడం వలన ఆ ప్రదేశం విశిష్టతను సంతరించుకుని, కాలక్రమంలో దివ్యక్షేత్రంగా అలరారుతూ వుండటం జరుగుతూ వుంటుంది. అంతకన్నా ప్రత్యేకతను సంతరించుకున్నదిగా 'ఓంకార సిద్ధేశ్వర క్షేత్రం' కనిపిస్తుంది.

కర్నూలు జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పరమశివుడు 'ఓంకార సిద్ధేశ్వరుడు' పేరుతో గంగా - గౌరీ సమేతంగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని గుర్తించిన 'సప్తరుషులు' ఇక్కడ తపస్సు చేసుకున్నారట. అంతే కాకుండా సాక్షాత్తు వ్యాస మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న సీతారాములు, సిద్ధేశ్వరుడిని దర్శించుకుని పూజాభిషేకాలు నిర్వహించారట. ఆ తరువాత కాలంలో పాండవులు స్వామిని దర్శించుకుని సేవించారని అంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించి అంకితభావంతో స్వామివారిని ధర్మబద్ధంగా ఏది కోరుకున్నా అది తప్పక సిద్ధిస్తుందనీ, అందువల్లనే మహర్షులు స్వామిని సిద్ధేశ్వరుడు అనే పేరుతో కొలిచారని చెబుతుంటారు. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ పుణ్యస్థలిలో అడుగుపెడితే, స్వామివారి లీలావిశేషాలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తుంటాయి ... సాష్టాంగ నమస్కారాలు చేయిస్తుంటాయి.


More Bhakti News