ఇలా కూడా శని ప్రభావం తగ్గుతుందట !
సాధారణంగా ఎవరైనా వదలకుండా వెంటతిరుగుతూ వుంటే, శనిలా పట్టుకున్నాడని చిరాకు పడుతుండటం చూస్తుంటాం. అంటే శని పట్టుకుంటే ఒక పట్టాన వదిలిపెట్టడనే విషయాన్ని అంతా బలంగా విశ్వసిస్తుంటారని అర్థం. శని పట్టుకుంటే పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది. అందుకు నిదర్శనంగా చాలామంది జీవితాలు కనిపిస్తుంటాయి.
అందువలన శనికి సాధ్యమైనంత దూరంగా వుండాలని ప్రతివాళ్లు కోరుకుంటూ వుంటారు. ఇక ఎంత దూరంలో వున్నా తన బారినుంచి తప్పించుకోవడం అసాధ్యమనే విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వుంటాడు. ఈ నేపథ్యంలో శని బారి నుంచి బయటపడటానికిగాను ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు.
ముఖ్యంగా చాలామంది ఆయా క్షేత్రాలకి వెళ్లి శని దోష నివారణకు సంబంధించిన కార్యక్రమాలు చేయిస్తుంటారు. శని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. శని అనుగ్రహాన్ని పొందడమంటే ఆయనను శాంతింపజేయడమే ... ఆయన మనసు గెలుచుకునేలా ప్రవర్తించడమే. భగవంతుడి పట్ల భక్తి ... పెద్దలపట్ల గౌరవం ... ఇతరులపట్ల దయ ... మూగ జీవాల పట్ల ప్రేమను కలిగి వుండటం వలన శని మనసు గెలుచుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దైవకార్యాలను జరిపించడం వలన .. పెద్దలకు అవసరమైన సేవలను చేయడం వలన .. ఇతరులకు సహాయ సహకారాలు అందించడం వలన ... పశువులకు ... పక్షులకు ఆహారాన్ని అందించడం వలన శని సంతోషిస్తాడని చెప్పబడుతోంది. శని ప్రసన్నుడవుతే సహజంగానే ఆయన ప్రభావం తగ్గుతుందని స్పష్టం చేయబడుతోంది.