దోషాలను నశింపజేసే నరసింహస్వామి

ఇక్కడా ... అక్కడా అనే కాదు ... ఎక్కడ చూసినా శ్రీహరి ఉంటాడు. ఆయన లేని ప్రదేశమే లేదనే ప్రహ్లాదుడి విశ్వాసం నిజమని ఈ లోకానికి ప్రత్యక్షంగా నిరూపించడం కోసం నరసింహస్వామి రాతి స్థంభం నుంచి అవతరించాడు. తన భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించడమే కాకుండా, వాళ్లని అనేక విధాలుగా హింసించేవారిని వదలనని హిరణ్యకశిపుడిని అంతం చేయడం ద్వారా నిరూపించాడు.

ఉగ్రరూపంలో వున్న స్వామిని శాంతింపజేయడానికి మహర్షులతో కలిసి లక్ష్మీదేవి ప్రధానమైన పాత్రను పోషించింది. ఈ కారణంగానే స్వామి లక్ష్మీ సమేతుడై అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించడం జరిగింది. అలాంటి శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటి 'చెన్నూర్' లో దర్శనమిస్తుంది. కృష్ణా జిల్లా 'పెడన' మండలంలో విశిష్టమైన ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రాచీన వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.

గర్భాలయంలో లక్ష్మీదేవి సమేతుడైన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. నిండుగా ... కనుల పడుగగా కొలువుదీరిన ఇక్కడి స్వామివారి సమ్మోహన రూపాన్ని చూసితీరవలసిందే. స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టినంత మాత్రాన్నే అనేక దోషాలు .. భయాలు నశిస్తాయని చెబుతుంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడిగా దాసాంజనేయస్వామి కనిపిస్తూ వుంటాడు. లక్ష్మీనరసింహ స్వామికి ఎదురుగా ... గంభీరంగా కొలువైన ఇక్కడి హనుమంతుడిని ఆరాధించే వారి సంఖ్య అధికంగా వుంటుంది.

ఈ స్వామిని పూజించినవారిని గ్రహ సంబంధమైన దోషాలు దరిచేరవని అంటారు. దోషాలు ... వాటి కారణంగా పీడించే వివిధ రకాల వ్యాధుల బారి నుంచి ఈ హనుమంతుడు కాపాడతాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ జరిగే ఊరేగింపులు ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాయి ... అడుగడుగునా ఆధ్యాత్మికపరమైన ఆనందానుభూతులను ఆవిష్కరిస్తూ వుంటాయి.


More Bhakti News