భక్తుడిని పరీక్షిస్తే దైవాన్ని పరీక్షించినట్టే !
నిజమైన భక్తులందరూ కొంతమంది వ్యతిరేకుల కారణంగా పరీక్షలు ఎదుర్కున్నవారే. భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు తామే గొప్పవాళ్లమని చెప్పుకుంటూ వుంటారు. భగవంతుడు తమకి చాలా దగ్గరవాడు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. మరెవరినైనా భగవంతుడు అనుగ్రహించాడని అంటే వీళ్లు సహించలేరు. అదంతా అసత్యమని ప్రజలను నమ్మించి, వాళ్లని తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ నేపథ్యంలో నిజమైన భక్తుడిని పరీక్షించడానికి ప్రయత్నించి భంగపడతారు. భక్తుడిని పరీక్షిస్తే ... భగవంతుడిని పరీక్షించినట్టేనని తెలుసుకుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి మనకి 'సూరదాస్' జీవితంలోను కనిపిస్తుంది. అంధుడైన సూరదాస్ ... నిరంతరం గోపాలుడిని కీర్తిస్తూ, ప్రజలకు ఎంతో దగ్గరవుతాడు. ఆయనని కృష్ణ భగవానుడు వెన్నంటి ఉంటాడని అక్కడి వాళ్లు చెప్పుకుంటూ వుంటారు.
అది సహించలేకపోయిన కొందరు, జనం చెప్పుకుంటున్నది నిజమో కాదో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన స్నానానికి నదీ తీరానికి వెళ్లే మార్గంలో పెద్ద మంటవేస్తారు. సూరదాస్ తడుముకుంటూ ఆ మంటను సమీపించగానే, అక్కడ మంటలు అదృశ్యమై ఆ స్థానంలో పూలు పరచబడతాయి. చాటునుంచి ఈ దృశ్యం చూసిన వాళ్లు బిత్తరపోతారు.
ఆ పూలపై నుంచి సూరదాస్ నడచి వెళ్లగానే ... దగ్గరికి వెళ్లి ఆ పూలను పరిశీలించి చూడబోతారు. ఆ ప్రయత్నంలో చేతులు కాలడంతో, సూరదాస్ భక్తి ఎలాంటిదో వాళ్లకి బోధపడుతుంది. ఆ మంటల నుంచి ఉపశమనం లభించాలంటే, సూరదాస్ ని క్షమాపణ కోరడం మినహా మరో మార్గంలేదని అనుకుంటారు. పరుగుపరుగున ఆయన దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి తమని మన్నించవలసిందిగా కోరుతూ పాదాలపై పడతారు.