ఇలా కూర్చుని భోజనం చేయాలి
భోజనం చేయడమనేది ఇప్పుడు ఒక పనిగా ... యాంత్రికంగా మారిపోయింది. ఏదో తినాలి కాబట్టి తింటున్నట్టుగా భోజనం చేయడం ముగుస్తుంటుంది. భోజనానికి ఒక సమయం కానీ ... పద్ధతిగా కూర్చుని తినడం కానీ చాలామందిలో కనిపించదు. ఉద్యోగస్తులకే తప్ప అది ఇతరులకు సాధ్యపడదని అంటారు. ఇక ఇంటికి వచ్చాక కూడా కుటుంబసభ్యుల్లో ఎవరికీ వీలు కుదిరితే వాళ్లు భోజనాల బల్ల దగ్గరికి వచ్చి తమకి కావసినవి పెట్టుకుని తినేసి వెళ్లిపోతుంటారు.
ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కుర్చీల్లో కూర్చుని భోజనాలు చేసే వాళ్లు కొందరైతే, మరికొందరు మంచాలపైనే కూర్చుని భోజనాలు కానిస్తుంటారు. అసలు తీరికే లేనట్టుగా నిలబడి హడావిడిగా తినేవాళ్లు కూడా వుంటారు. ఈ పద్ధతి ఆధునిక ఆచారంగా మారి వివాహ వేడుకల్లోకి ప్రవేశించి కూడా చాలాకాలమైంది. ఇక అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, కొంతమంది పాదరక్షలు కూడా వదలకుండా భోజనం చేయడం.
భగవంతుడు అందించిన ఆహారం ఈ విధంగా స్వీకరించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఎవరికి ఎన్ని పనులు వున్నా ... ఎంత తీరిక లేకుండా వున్నా భోజనం చేసే విషయంలో కొన్ని నియమ నిబంధలను పాటించాలని అంటోంది. స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. పద్మాసనం వేసినట్టుగా కూర్చుని నిదానంగా భోజనం చేయాలని శాస్త్రం చెబుతోంది.
తూర్పు ముఖంగా గానీ, దక్షిణ ముఖంగా గాని కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భోజనం చేయాలని అంటోంది. లేదంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తడమే కాకుండా, ఆయుష్షు ... యశస్సు నశిస్తాయని స్పష్టం చేస్తోంది. అందుకే ఆచారాల పేరుతో పూర్వీకులు చెప్పిన పద్ధతులను అనుసరించడం అన్ని విధాలా మంచిదనే విషయాన్నీ మరిచిపోకూడదు.