ఇక్కడి మట్టిమహిమ అలాంటిది !

రాఘవేంద్రస్వామి మంచాల గ్రామం (మంత్రాలయం) కోరి మరీ నవాబు నుంచి కానుకగా గ్రహిస్తాడు. అంతకన్నా మంచి గ్రామాలను ఇస్తానని నవాబు చెప్పినా, ఆయన ఈ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. అందుకు గల కారణమేమిటని శిష్యులు అడిగితే, తాను ప్రహ్లాదుడుగా వున్నప్పుడు ఈ ప్రదేశంలో యజ్ఞయాగాదులు నిర్వహించినట్టు చెబుతూ, ఆనాటి ఆనవాళ్లను కూడా చూపిస్తాడు.

ఆనాటి ఆ యజ్ఞయాగాదుల కారణంగా ఈ ప్రాంతం పవిత్రమైందనీ ... మహిమాన్వితమైనదని స్వామి సెలవిస్తాడు. అందుకు నిదర్శనం కూడా కనిపిస్తూనే వుంటుంది. ఒకసారి ఒక శిష్యుడు తనకి వివాహం చేసుకోవాలని వుందని చెప్పడంతో, స్వామివారు ఆ ప్రదేశంలోని పిడికెడు మట్టితీసి ఇచ్చి ఆ శిష్యుడిని పంపించి వేస్తాడు.

మార్గమధ్యంలో ఆ శిష్యుడు ఓ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ కుటుంబ సభ్యులను ఓ పిశాచి పీడిస్తోందని తెలిసి, దానిపై స్వామివారి ఇచ్చిన మట్టి చల్లుతాడు. అంతే ఆ క్షణం నుంచి వాళ్లకి పిశాచ బాధ తొలగిపోతుంది. దాంతో వాళ్లు తమని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కూతురిని అతనికిచ్చి వివాహం చేస్తారు.

అలా స్వామివారు శిష్యుడి కోరికను నెరవేర్చడమే కాకుండా, మంచాల మట్టికి గల మహిమను తెలియజెప్పారు. ఈ కారణంగానే ఇప్పటికీ మంత్రాలయం వెళ్లిన భక్తులు ఇక్కడి బృందావనం నుంచి కాస్త మట్టి తీసుకువచ్చి తమ ఇంటి ప్రాంగణంలో చల్లుతూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించవనీ, అనారోగ్యాలు దరిచేరవని విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News