సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరి

జగన్మాత అయినటువంటి పార్వతీదేవి సర్వమంగళగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. కాలకూట విషాన్ని మింగిన పరమశివుడు, దాని ప్రభావం నుంచి బయటపడటానికి కారణం, అమ్మవారి మాంగల్య బలమేనని చెబుతుంటారు. అలాంటి సర్వమంగళను పూజించడం వలన, తమ సౌభాగ్యం కాపాడబడుతుందని స్త్రీలు బలంగా విశ్వసిస్తూ వుంటారు.

అత్యంత శుభప్రదమైన మాసంగా చెప్పబడుతోన్న శ్రావణమాసపు మంగళవారాల్లో ఆ తల్లిని సేవించడం వలన ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని భావిస్తుంటారు. ఈ కారణంగానే సౌభాగ్య రక్షణ కోసం 'మంగళగౌరి' వ్రతాన్ని చేస్తుంటారు. దీనినే మంగళగౌరి నోము అని కూడా అంటూ వుంటారు.

పూజా మందిరంలో అమ్మవారి ప్రతిమను సిద్ధం చేసుకుని, ఈ మాసంలో గల అన్ని మంగళవారాల్లోనూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ వుండాలి. గరికతోను ... ఉత్తరేణి దళాలతోను అమ్మవారిని పూజించాలి. వివాహమైన తరువాత వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆరంభించిన స్త్రీలు, అయిదు సంవత్సరాల పాటు దానిని ఆచరిస్తూ ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. ఈ విధంగా పార్వతీదేవిని పూజించడం వలన, అమంగళ దోషాలు నశించి, సౌభాగ్య సిద్ధి కలుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News