లక్ష్మీదేవికి ఈ నైవేద్యం అంటే ఇష్టమట !

శ్రావణమాసం అనేక వరాలను అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి ... సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను విశేషంగా అనుగ్రహించడం ఈ మాసం యొక్క ప్రత్యేకతగా కనిపిస్తూ వుంటుంది. శ్రావణ మంగళవారాల్లో పార్వతీదేవిని ... శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, పెద్ద సంఖ్యలో మహిళలు ప్రత్యేక పూజలు - వ్రతాలు చేస్తుంటారు.

పూజా మందిరాల్లో పార్వతీదేవికి ... లక్ష్మీదేవికి ప్రధానమైన స్థానాన్ని కల్పిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఈ రోజుల్లో ఇంట్లో పూజ ముగించుకుని దగ్గరలో గల అమ్మవారి ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది. ఇక శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి తాజా పండ్లతో పాటు తామరపూలనుగానీ ... గులాబీలనుగాని తీసుకువెళ్లాలి.

పరమాన్నం అమ్మవారికి అత్యంత ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. అందువలన బెల్లం ... ఆవుపాలు ... కొసలు విరగని బియ్యంతో పరమాన్నం తయారుచేసి ఇంటిదగ్గర పూజామందిరంలో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆలయానికి వస్తే పరమాన్నం చేసి పెట్టమని అర్చకులకు చెప్పి, వారికి ఆవుపాలు .. బెల్లం ... కొసలు విరగని బియ్యాన్ని ఇవ్వాలి.

పరమపవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసపు శుక్రవారాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తూ ... పగలు నిద్రపోకుండగా, ఆ రోజంతా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ కనకధారాస్తవం .. లక్ష్మీదేవి అష్టోత్తరం ... లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News