చింతలు తీర్చే వేంకటేశ్వరుడు
ఏదైనా ఆపద వచ్చినప్పుడు ... కష్టం నష్టం వాటిల్లినప్పుడు ఎక్కువగా ఆ వేంకటేశ్వరుడే గుర్తుకు వస్తుంటాడు. నిలువెత్తు రూపం ... నిండైన రూపంతో కనిపించే ఆ స్వామి తమని తప్పక గండం నుంచి గట్తెక్కిస్తాడని భక్తులు భావిస్తారు. తనని ఆశ్రయించిన భక్తులను ఆదుకోవడంలో ఆయన ప్రదర్శించిన లీలావిశేషాలను గురించి తలచుకుంటారు. అలాగే తమని కూడా బయటపడేయమని కోరుతుంటారు.
మొక్కుకుంటే ఆ స్వామి ఆదుకుంటాడని బలంగా విశ్వసిస్తూ ముడుపులు కడతారు. ఆ చల్లని చూపుల చక్కని దేవుడు రక్షించగానే, కన్నీళ్లతోనే ఆయనని దర్శించుకుంటారు. ఆయన ఎక్కడ వున్నా వేలాదిగా భక్తులు తరలిరావడానికి గల కారణమేవిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆ స్వామికి కృతజ్ఞతలతో పాటు మొక్కుబడులు చెల్లించుకుని వెనుదిరుగుతూ వుంటారు. అలా భక్తుల ఆపారమైన విశ్వాసాన్ని చూరగొన్న వేంకటేశ్వరుడు, వాళ్లతో నిత్యపూజలు అందుకోవడం కోసం అనేక ప్రాంతాల్లో కొలువుదీరాడు.
అలాంటి ఆలయాల జాబితాలో తెనాలిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంతో నిర్మించబడిన ఇక్కడి ఆలయంలో స్వామివారు .. అమ్మవార్లతో పాటుగా దర్శనమిస్తూ వుంటాడు. ఒక భక్తుడికి స్వామివారు కలలో కనిపించి, ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి చెప్పి, తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఫలితంగా ఇక్కడ స్వామివారి ఆలయం నిర్మించడం జరిగిందని చెబుతుంటారు.
ఇక్కడి స్వామిని దర్శించడం వలన చింతలు తీరిపోతాయనీ ... సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని అంటారు. పర్వదినాల్లో స్వామివారి ప్రత్యేక పూజల్లోనూ ... సేవల్లోను పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. తమ కష్టాలను తీర్చే వేంకటేశ్వరుడిని కనుల నిండుగా చూసుకుంటూ వుంటారు. ఆయన ప్రతిసేవని ఓ పెద్ద పండుగలా జరుపుకుంటూ వుంటారు.