సర్పరాజుతో పూజించబడుతోన్న శివుడు !
పరమశివుడుతో నాగేంద్రుడు విడదీయరాని అనుబంధాన్ని కలిగి వుంటాడు. సదాశివుడిని విడిచి క్షణకాలమైనా వుండలేనట్టుగా నాగరాజు ఆయన కంఠాన్ని చుట్టుకుని కనిపిస్తూ వుంటాడు. కంఠంపై నాగరాజు కదలాడుతున్నా ఆయన ఆనందాన్నే తప్ప అసహనాన్ని వ్యక్తం చేయడు.
ఆదిదేవుడితో నాగరాజుకి గల అనుబంధానికి ప్రతీకగానే, చాలా క్షేత్రాల్లో శివలింగానికి నాగపడగను ఆభరణంగా అలంకరిస్తూ వుంటారు. అలాంటి నాగరాజు శంకరుడిని ప్రత్యక్షంగా పూజిస్తోన్న క్షేత్రం ఒకటుంది ... అదే 'చిన్నకోడప్ గల్'. నిజామాబాద్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడు పేరుతో దర్శనమిచ్చే శివలింగాన్ని .. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సృష్టించి ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.
అలాంటి ఈ శివలింగాన్ని నాగేంద్రుడు అనునిత్యం పూజించేవాడట. నిరంతరం ఆయన ఈ పరిసరాల్లో సంచరించడం వలన, ఇక్కడి బండరాళ్లపై సర్పాకారంలో గల ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి. ఆశ్చర్యచకితులను చేసే మరో విశేషమేవిటంటే, ఈ ఆలయం పరిసరాల్లో దివ్యమైన తేజస్సు కలిగిన ఒక పాము సంచరిస్తూ ఉంటుందట. దాంతో ఇప్పటికీ నాగరాజు ఈ క్షేత్రంలోనే ఉన్నాడనీ, స్వామివారిని ప్రత్యక్షంగా సేవించుకుంటున్నాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.