ముల్లోకాలలోని తీర్థాలు ఇక్కడి కొస్తాయట !
తిరుమల కొండలపై అనేక తీర్థాలు అలరారుతున్నాయి. ఈ దివ్యతీర్థాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. దేవతలు .. మహర్షులు ... మహారాజులు ఈ తీర్థాలలో స్నానమాచరించి తరించారు. అలాంటి తీర్థాలలో 'కపిల తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడే ఈ పుణ్యతీర్థం, తిరుపతిలో అలిపిరి దిగువకు వెళితే కనిపిస్తుంది.
తిరుమల తిరుపతికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా కపిలతీర్థాన్ని దర్శించుకుంటారు. భక్తుల పాపాలను కడిగివేయడానికి అన్నట్టుగా కొండలపై నుంచి జలధారాలు దూకుతూ వస్తుంటాయి. రమణీయమైన ఆ దృశ్యాన్ని చూసితీరవలసిందే. కపిలమహర్షి ఈ ప్రదేశంలో శివుడిని గురించి తపస్సుచేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందిన కారణంగా దీనిని కపిల తీర్థమని అంటారు.
ఏ తీర్థం విషయంలో కనిపించని ఒక ప్రత్యేకత, ఈ తీర్థం విషయంలో కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ తీర్థంలో స్నానం చేయడం వలన ముల్లోకాలలోని సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ విశేషాన్ని ఈ తీర్థం ఏడాదిలో ఒక రోజున కలిగివుంటుందని అంటారు ... ఆ రోజే కార్తీక పౌర్ణమి. ఈ దివ్య తీర్థంలో ఎప్పుడు స్నానమాచరించినా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
అయితే ... ముల్లోకాలలోని సమస్త పుణ్యతీర్థాలు 'కార్తీక పౌర్ణమి' రోజున మధ్యాహ్నం సమయంలో కొంతసేపు ఈ తీర్థంలో కలుస్తాయట. ఈ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న సమస్త పాపాలు నశిస్తాయని చెప్పబడుతోంది. ఈ కారణంగానే కార్తీకమాసంలో ఇక్కడ భక్తుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది.