ఇక్కడి సీతారాములను సేవిస్తే చాలు
లోకంలో ధర్మాన్ని స్థాపించడానికీ ... ధర్మమార్గంలో ప్రజలు నడచుకునేలా చేయడానికి అవతరించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. సత్యానికీ ... ధర్మానికి కట్టుబడి వుంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అంతిమంగా విజయం లభిస్తుందని ఆయన నిరూపించాడు. ఆశ్రితుల పట్ల శాంతాన్ని ... శతృవుల పట్ల పరాక్రమాన్ని ప్రదర్శించిన రాముడంటే అందరికీ ఇష్టమే.
అందుకే అనేక గ్రామాల్లో రామాలయమే ముందుగా నిర్మించబడి వుంటుంది. రాముడు ప్రజల హృదయాలకు అంతగా దగ్గర కావడమే అందుకు కారణమని చెప్పవచ్చు. అలా నిర్మించబడిన ప్రాచీన రామాలయాలలో ఒకటి వరంగల్ జిల్లా 'హసన్ పర్తి' లో కనిపిస్తుంది. ఎన్నో కష్టాలుపడిన సీతారాములు ఇక్కడికి వచ్చే భక్తుల కష్టాలను సహనంతో వింటారనీ, అనతికాలంలోనే ఆ కష్టం నుంచి బయటపడేస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
తమ కష్టాలను చెప్పుకోగానే కరుణామృతాన్ని కురిపించే సీతారాములను భక్తులు అంకితభావంతో ఆరాధిస్తూ వుంటారు. శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు ఇతర పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. తమని కనిపెట్టుకునుండే కళ్యాణరాముడిని అనునిత్యం సేవిస్తూ వుంటారు. ఇక్కడికి సమీపంలోనే 'ఎర్రగట్టు' ఆలయం వుంది. గుట్టపైనున్న ఈ ఆలయంలో స్వయంభువు వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తూ వుంటాడు. ఈ ఆలయానికి చెందిన వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి, హసన్ పర్తి రామాలయంలో కొలువుదీరి వుంటుంది.
ఎర్రగట్టుపై కల్యాణోత్సవం సందర్భంగా, రామాలయంలో గల ఈ ఉత్సవమూర్తి ఊరేగింపుగా తరలివెళుతూ వుంటుంది. తరతరాలుగా ఇక్కడ ఈ ఆనవాయతీ కొనసాగుతూ వస్తోంది. ఇలా శ్రీరాముడి మూలమూర్తి గల ఆలయంలో, వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తిగా పూజలందుకుంటూ వుండటం ఈ క్షేత్ర ప్రత్యేకతగా చెబుతుంటారు. ప్రతి యేటా అటు రాములవారి కల్యాణ మహోత్సవంలోను ... ఇటు వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలోను పాల్గొంటూ తరిస్తుంటారు.