శ్రావణంలో ఏయే దేవతలను ఆరాధించాలి ?
శ్రావణమాసం అనేక శుభకార్యాలు ... దైవారాధనల కలయికగా కనిపిస్తూ వుంటుంది. వివిధ రకాల వేడుకలకు ఈ మాసం ఓ వేదికగా అనిపిస్తూ వుంటుంది. పూజలు ... నోములు ... వ్రతాలు ... జయంతోత్సవాలు ఇలా ఈ మాసమంతా కూడా అనేక పుణ్య విశేషాలను సొంతం చేసుకుని కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయాన్నీ .. ప్రతి ఆలయం ఒక తీర్థాన్ని తలపిస్తూ వుంటుంది.
ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ మాసంలో శ్రీమహావిష్ణువును ... లక్ష్మీదేవిని ... శివపార్వతులను, సకల దేవతా స్వరూపంగా చెప్పబడుతోన్న గోవుని ... నాగదేవతలను ... పితృ దేవతలను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు ... హయగ్రీవుడు వంటి దైవాలు ఆవిర్భవించిన మాసంగా, గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశాన్ని తెచ్చి విజయాన్ని సాధించిన మాసంగా శ్రావణానికి ఒక ప్రత్యేకత వుంది.
భగవంతుడి అనుగ్రహాన్ని భక్తులకు త్వరగా లభించేలా చేసే విశిష్టత ఈ మాసానికి వుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం భక్తులపై ఉండేలా చేస్తుంది. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఇలా అనేక శుభకార్యాలకు ... ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవుగా దర్శనమిస్తూ, విశేష పుణ్యఫలాలను విస్తారంగా అందించే 'శ్రావణ మాసం' మానవాళికి భగవంతుడు ప్రసాదించిన భారీ వరంగా చెప్పుకోవచ్చు.