అసమాన భక్తికి అపారమైన శక్తి వుంటుంది
ఒకసారి లక్ష్మణసేన మహారాజు ఆస్థానానికి ఒక సంగీత విద్వాంసుడు వస్తాడు. ఆయన సంగీతాన్ని వినడానికి రాజుగారు ఉద్యానవనంలో ఏర్పాట్లు చేయిస్తాడు. తన సంగీతంతో ఎదురుగా వున్న పూలచెట్టు మంటల్లో కాలిపోయేలా చేస్తాననీ, అనుమతిని ఇవ్వవలసినదని రాజుగారిని కోరతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో, సంగీతాన్ని ఆరంభించి తన ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తాడు.
ఆయన చెప్పినట్టుగానే అందరూ చూస్తుండగానే ఆ పూలచెట్టు తగలబడిపోతుంది. రాజుగారు ... జయదేవుడితో సహా అంతా ఆశ్చర్యపోతారు. ఆ సంస్థానంలో గల విద్వాంసులు ఎవరైనా తమ ప్రతిభతో ఆ పూలచెట్టుకి ప్రాణం పోస్తే, ఓటమిని అంగీకరించి తాను తిరిగి వెళ్లిపోతానని ఆ విద్వాంసుడు అంటాడు. సంగీత విద్వాంసులు ఎవరూ రాకపోవడంతో, ఆస్థాన పరువు ప్రతిష్ఠలు కాపాడే బాధ్యత జయదేవుడిదేనని అంటాడు మహారాజు.
ఆయన కృష్ణుడిని కీర్తిస్తూ పాడటంతో, అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఆయన పాటకు అంతా పరవశిస్తూ ఉండగానే, మంటల్లో మాడిపోయిన పూలచెట్టు తిరిగి చిగురిస్తుంది. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. అసమానమైన ఆయన భక్తినీ ... కవితా శక్తిని పండితులందరూ ప్రశంసిస్తారు. ఈ సంఘటనతో జయదేవుడి పట్ల రాజుగారికి గల ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి.