ఆప్తులెవరనేది అప్పడే తెలుస్తుంది !

సాధారణంగా ఎవరైనా కష్టాల్లో వున్నప్పుడు .. వాళ్లకి తాము సాయం చేస్తే రేపటి రోజున తమకి సాయపడతారనే ఉద్దేశంతో కొందరు సాయం చేస్తుంటారు. రేపటి రోజు సంగతి తరువాత ... ముందు వాళ్లని ఆదుకోవాలని అనే ఉద్దేశంతో కొందరు ముందుకొస్తుంటారు. అయితే పొందిన సాయాన్ని మరిచిపోకూడదు, ప్రతిసాయం చేసి వాళ్ల రుణం తీర్చుకోవాలనే వాళ్లు మాత్రం కొంతమందే వుంటారు.

ఇలాంటి వాళ్లు కొందరు ఇరుగు పొరుగు వాళ్లలోను ... స్నేహితుల్లోను ... బంధువుల్లోను కనిపిస్తుంటారు. సమయానికి స్పందించి సాయం చేసిన వాళ్లను వీళ్లు చక్కగా ఉపయోగించుకుంటారు. అవసరం గట్టెక్కిన తరువాత, సాయం చేయడమనేది అవతలవారి బలహీనతగా భావిస్తుంటారు. సాయాన్ని పొందిన క్షణంలో కృతజ్ఞతలు చెబుతారు గానీ, తిరిగి సాయం చేయవలసి వస్తే మాత్రం కంటికి కనిపించరు.

అందరూ తన వాళ్లనుకుని ఎప్పటికప్పుడు సాయపడుతూ వచ్చిన వాళ్లు, తమకి ఏ అవసరం వచ్చినా ... ఆపద వచ్చినా ఆదుకునే వాళ్లు చాలామంది వున్నారని అనుకుంటారు. కానీ ఆపద వాళ్ల వరకూ వచ్చేసరికి, తన వాళ్లు అనుకున్న వాళ్లు ఒక్కరు కూడా అక్కడ కనిపించరు. నోరు తెరిచి అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వుంటారు. గతంలో వాళ్ల నుంచి తాము సాయాన్ని పొందామనే విషయాన్ని మరిచిపోయి నటించేస్తుంటారు.

ఒకవైపున ఆపద నుంచి ఎలా గట్టెక్కాలానే బాధ ... మరో వైపున అప్పటివరకూ తాను నమ్మినది ఇలాంటి వాళ్లనా అనే బాధ మంచివాళ్ల హృదయాలను గాయం చేస్తుంటాయి. ఆపద వచ్చినది కనుక ఆప్తులెవరో తెలిసింది ... ఇక మీదట ఇలాంటి వాళ్లకి దూరంగా ఉండాలనిపిస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితి నుంచి గట్తెక్కేదెలా ? కొండంత చీకటిని కొవ్వొత్తిలా ఎలా ఎదుర్కునేది ? అని ఆలోచిస్తూ ఉండగానే ఎవరో ఒకరు వస్తారు ... కావలిసిన సాయాన్ని చేస్తారు.

ఆ రూపంలో వచ్చిన వాడు నిజంగా భగవంతుడే. సాయాన్ని పొందిన వాళ్లు మరిచిపోయినా ... సాయపడుతోన్న వాళ్లని ఆ భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. అలాంటి వాళ్లు ఆపదలో వుంటే అందరూ ముఖం చాటేసినా, ఆ దేవుడే ఏదో ఒక రూపంలో దిగివస్తాడు. ఏకాకిగా మిగిలిన వాళ్లకి తోడుగా నిలుస్తాడు ... సమస్యల సుడి గుండాలను దాటిస్తాడు.

అవసరాల్లో ... ఆపదల్లో ఉన్నవారికి సాయం చేయాలి. అయితే తమకి కష్టం వస్తే ఫలానా వాళ్లే సాయపడతారనే అతి నమ్మకానికి కాస్త దూరంగానే వుండాలి. మంచి మార్గంలో ప్రయాణిస్తున్నవారికీ ... ఇతరులకు మంచి చేస్తున్నవారికి భగవంతుడు ఎప్పుడూ ఆప్తుడిగానే ఉంటాడని గ్రహించాలి.


More Bhakti News