పుష్పాభిషేకం వలన కలిగే ఫలితం ?
పరమశివుడు అభిషేక ప్రియుడని చెప్పబడుతోన్న కారణంగా, ఆయనని ఆనందింపజేయడానికీ .. అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు అభిషేకాన్నే మార్గంగా ఎంచుకుంటూ వుంటారు. వివిధ రకాల పదార్థాలతో శివలింగాన్ని రూపొందించి అభిషేకించడం వలన గల ఫలితాలను ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే వివిధరకాల ద్రవ్యాలతో ఆ దేవదేవుడిని అభిషేకించడం వలన కలిగే ఫలితాలను కూడా స్పష్టం చేస్తున్నాయి.
ఆయా ఫలితాలను దృష్టిలో పెట్టుకుని సదాశివుడిని అభిషేకించడం వలన, ఆయా కోరికలు నెరవేరుతూ వుంటాయి. దాంతో ఆరోగ్యాన్ని ... ఐశ్వర్యాన్ని ... సంతానాన్ని ఇలా కావలిసినవి పరమేశ్వరుడి అనుగ్రహంతో పొందడానికి భక్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో భూమిని ఆస్తిగా పొందడానికి గాను వివిధ రకాల పుష్పాలతో స్వామిని అభిషేకించాలని చెప్పబడుతోంది.
సాధారణంగా స్థలం అనేది స్థిరాస్తిగా వుంటుంది. స్థిరాస్తికి వుండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. స్థిరాస్తిని భవిష్యత్తుకి భరోసాగా భావిస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దానిని వదులుకోకుండా ఉండటానికే ప్రయత్నిస్తుంటారు. అలాంటి భూమి కొంత వున్నా చాలనుకునే వాళ్లు ... దానికోసం ఆరాటపడే వాళ్లు ఎంతోమంది వుంటారు. అలాంటి వాళ్లు తమ కోరికను నెరవేర్చుకోవాలంటే, పరమశివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పాభిషేకం చేయడం మంచిదనే విషయాన్ని మరిచిపోకూడదు.