అదే స్వామివారి లీలావిశేషం !

ఒకసారి బీదర్ కి చెందిన కొంతమంది భక్తులు మాణిక్య ప్రభువును కలుసుకుంటారు. వాళ్లందరూ కలిసికట్టుగా రావడం చూసి, విషయమేవిటని ప్రభువులవారు అడుగుతాడు. వాళ్లంతా కూడా తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా ప్రభులవారిని ఆహ్వానిస్తారు. ఆయన అడుగుపెడితే తమ గృహం పావనమైపోతుందనీ, తమ అభ్యర్థనను మన్నించమని కోరతారు.

అందరూ ఒకే రోజున తమ ఇంటికి రావలసిందిగా కోరడంతో, స్వామి నవ్వుతూనే అందుకు అంగీకరిస్తాడు. తమలో ఎవరు నిజమైన భక్తులో స్వామికి తెలుసు కనుక, వాళ్ల ఇంటికే ఆయన రావడం జరుగుతుందని చర్చించుకుంటూ అందరూ అక్కడి నుంచి వెనుదిరుగుతారు. ఎవరికి వారు ప్రభువుల వారు తమ ఇంటికే వస్తాడని ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటూ వుంటారు.

భక్తులకు ఇచ్చిన మాట మేరకు ఆ రోజున ప్రభువుల వారు వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేసి వెళ్లిపోతారు. ఆ సాయంత్రం ఆ భక్తులంతా ప్రభువుల వారు తమ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయారని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఎవరికి వారు తాము చెబుతున్నది నిజమనీ, ఎదుటివాళ్లు చెబుతున్నది అబద్ధమని అనుకుంటారు. ఈ విషయంలో ఎవరికి వారు సాక్ష్యం చూపించడానికి సిద్ధపడిపోతూ ఉండటంతో, వాదన మరింత పెరిగిపోతుంది.

నేరుగా ప్రభువుల వారి దగ్గరికి వెళ్లి ఆయన ద్వారానే అసలు విషయం చెప్పించాలనే నిర్ణయానికి వస్తారు. మరునాడే ప్రభువుల వారిని కలుసుకుని తమ వాదనలకు గల కారణాన్ని ప్రస్తావిస్తారు. ప్రభువుల వారు చిరునవ్వును చిందిస్తూ, అందరూ చెబుతున్నదీ నిజమేననీ, తాను అందరి ఇళ్లకు వచ్చానని అంటాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్లు ఆశ్చర్యచకితులవుతారు.

ప్రభువుల వారి మహిమను గుర్తించకుండా, ఆయన తమకి మాత్రమే సొంతం అన్నట్టుగా వ్యవహరించినందుకు బాధపడతారు. అజ్ఞానంతో పరస్పరం వాదనకి దిగినందుకు తమని మన్నించమంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తారు. ఇలాంటి సంఘటనే మనకి శిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలోను కనిపిస్తుంది.


More Bhakti News