సిందూర హనుమంతుడు

లోకంలో బలసంపన్నులు .. బుద్ధిబలం కలిగిన వాళ్లు తాము సాధించిన విజయాలకు తామే కారకులమని భావిస్తుంటారు. ఈ కారణంగానే వాళ్లలో భక్తిశ్రద్ధలు అంతగా కనిపించవు. కానీ భుజ బలాన్నీ ... బుద్ధి బలాన్ని ప్రసాదించినది ఆ శ్రీమన్నారాయణుడేనని విశ్వసించి, వాటిని ఆ భగవంతుడి సేవకే వినియోగించిన వినయశీలిగా హనుమంతుడు కనిపిస్తాడు. అందుకే ఆధ్యాత్మిక చరిత్రలో హనుమంతుడికి విశిష్టమైన స్థానం లభించింది.

సాధారణంగా వివిధ క్షేత్రాల్లో హనుమంతుడి విగ్రహానికి సిందూరం పూస్తుంటారు. అలాగే ఆ స్వామికి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్వామికి సిందూరమంటే ఎందుకంత ఇష్టమనే సందేహం భక్తులలో తలెత్తుతూ వుంటుంది. అయితే శ్రీరాముడి పట్ల హనుమకు గల ప్రేమే, ఆయన సిందూరాన్ని ఇష్టపడేలా చేసిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఒకసారి సీతమ్మవారు పాపిటలో సిందూరం దిద్దుకోవడం చూసిన హనుమంతుడు, ఆ విధంగా చేయడం ఎందుకోసమని అడుగుతాడు. అలా సిందూరం ధరించడం వలన రాముడి ఆయుష్షు పెరుగుతుందని చెబుతుంది. అంతే ఆ క్షణమే అక్కడి నుంచి మాయమైన హనుమంతుడు కొంతసేపటికి తిరిగొస్తాడు. అప్పుడు సీతారాములు సరదాగా ముచ్చటించుకుంటూ వుంటారు.

ఒళ్లంతా సిందూరం పూసుకుని వచ్చిన హనుమంతుడిని ఆశ్చర్యంగా చూస్తూ, విషయమేమిటని అడుగుతాడు రాముడు. సమాధానం చెప్పకుండా హనుమంతుడు దిక్కులు చూస్తుంటాడు. అప్పటికే సీతకి విషయం అర్థమైపోతుంది. దాంతో ఆమె జరిగిన సంఘటన గురించి ఆయనకి వివరిస్తుంది. రాముడి కళ్లు చెమ్మగిల్లడంతో ఆప్యాయంగా హనుమంతుడిని అక్కున చేర్చుకుంటాడు.

ఆ రోజున మంగళవారం కావడంతో, ఇక నుంచి ఎవరైతే ఆ రోజున హనుమంతుడికి సిందూరం సమర్పిస్తారో వాళ్లకి సకల శుభాలు చేకూరతాయని చెబుతాడు. ఈ కారణంగానే మంగళవారం రోజున హనుమంతుడికి సిందూరాన్ని సమర్పించడం ... సిందూర అభిషేకం చేయించడం జరుగుతుంటుంది.


More Bhakti News